చెన్నై, మార్చి 1: రాష్ర్టాలకు మరిన్ని అధికారాలను కల్పించేందుకు రాజ్యాంగాన్ని మార్చాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. రాష్ర్టాల అధికారాలను కుదించేందుకు కేంద్రం జరుపుతున్న ప్రయత్నాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ డిమాండ్‌కు కాంగ్రెస్, సీపీఎంతోపాటు ప్రాంతీయపార్టీలు మద్దతు అందించాలని కోరారు. సోమవారం చెన్నైలో తన ఆత్మకథ ‘ఉంగళిల్ ఒరువన్’ (మీలో ఒకడిని) ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేరళ సీఎం పినరాయి విజయన్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తదితరుల సమక్షంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తమిళనాడు జలవనరుల మంత్రి దురైమురుగన్ తొలి ప్రతిని అందుకున్నారు.
విచ్ఛిన్నకర శక్తుల నుంచి పెనుముప్పు
సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. దేశం ప్రస్తుతం విచ్ఛిన్నకర శక్తుల నుంచి పెనుముప్పును ఎదుర్కొంటున్నదని హెచ్చరించారు. ఆ శక్తులను ఓడించి దేశ పునాది సూత్రాలను రక్షించాలని అన్నారు. అందుకు సెక్యులర్ విలువలు కలిగిన పార్టీలన్నీ ఏకతాటి మీదకు రావాల్సి ఉందని గుర్తు చేశారు. అలాగే రాష్ర్టాలు శక్తిహీనమైన ప్రాంతాలుగా మారకుండా నిరోధించాలని స్టాలిన్ అన్నారు. ఆర్థిక హక్కు, ఆలోచనల హక్కు ఇలా అన్నీ ఒకటొకటిగా రాష్ర్టాల నుంచి లాగేసుకుంటున్నారని పేర్కొన్నారు. భారతదేశ సమాఖ్యతత్వంపై రాహుల్ గాంధీ ఇటీవల పార్లమెంటులో చేసిన ప్రసంగాన్ని స్టాలిన్ ప్రశంసించారు. బీజేపీ తమిళనాడులో ఎన్నటికీ అధికారంలోకి రాదన్న రాహుల్ మాటలను ప్రత్యేకంగా ఉదహరించారు. అణ్ణాదురై, కరుణానిధి వంటి ద్రవిడ నేతలు అప్పటి జాతీయ నాయకుల్లో ఈ తరహా ఆలోచనల పరిణామాన్నే కోరుకున్నారని, వాళ్ల జీవితకాలంలో అది సాధ్యపడలేదని చెప్పారు. మార్పు ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు వస్తున్నట్టు కనిపిస్తున్నదని తమిళనాడు సీఎం చెప్పారు. రాష్ర్టాల హక్కులను కేంద్రం లాగేసుకుంటున్నట్టు ఇప్పుడు అన్ని పార్టీలు గుర్తిస్తున్నాయని అన్నారు. ‘రాష్ర్టాల్లో స్వయంపాలన, కేంద్రంలో సమాఖ్య పాలన’ అనేది నేడు జాతీయ నినాదమైందని స్టాలిన్ అన్నారు. ఇది కేవలం చట్టపరమైన అంశంగా కాకుండా సామాజిక న్యాయసూత్రంగా ఉండాలని అన్నారు.
స్టాలిన్‌కు సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ మంగళవారం స్టాలిన్‌కు ఫోన్ చేశారు. ఆయన కలకాలం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, మరిన్ని విజయాలు సాధించాలని, కోరుకొన్న లక్ష్యాలకు చేరుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌కు స్టాలిన్ కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు
తమిళనాడు సీఎంస్టాలిన్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో, శాంతి సౌఖ్యాలతో స్టాలిన్ జీవితకాలం ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.