Delhi HC | ‘నా సహజీవన భాగస్వామిని, మా ఇద్దరికి కలిగిన సంతానాన్ని కుటుంబ పెన్షన్‌లో చేర్చాలని కోరుతూ ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీచేసింది. ఆ రిటైర్డ్ ఉద్యోగి సహజీవన భాగస్వామికి, ఆమె పిల్లలకు పెన్షన్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కోర్టు కేంద్రానికి ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నది.
వివరాల్లోకి వెళ్తే.. పిటిషనర్ గత 40 ఏళ్లుగా ఒక మహిళతో సహజీవనం చేస్తున్నారు. వారికి సంతానం కూడా కలిగింది. ఈ బంధం ప్రారంభం కావడానికి ముందే అతడు తన భార్య నుంచి విడిగా ఉంటున్నారు. కానీ వారు చట్టబద్ధంగా విడాకులు తీసుకోలేదు. దాంతో ఆయన భార్య.. ‘తన భర్త తనను, తన కుమార్తెను నిర్లక్ష్యం చేస్తూ మరో మహిళతో కలిసి ఉన్నారు’ అంటూ ఫిర్యాదు చేసింది.
ఈ క్రమంలో 1990లో ఆయన శాఖాపరమైన దర్యాప్తును ఎదుర్కొన్నారు. అతడికి నాలుగేళ్లపాటు జీతంలో కోతపడింది. తర్వాత మరోసారి 2011లో ఇలాంటి క్రమశిక్షణాచర్యలే ఎదురయ్యాయి. తన భాగస్వామి, పిల్లల కోసం దౌత్యపరమైన పాస్‌పోర్టుల విషయంలో తప్పుడు వివరాలు ఇచ్చారని ఉన్నతాధికారులు నివేదికలో వెల్లడించారు. దాంతో నెలవారీ పెన్షన్‌లో 50 శాతంతోపాటు, గ్రాట్యుటీ ప్రయోజనాల్లో కోతపడింది.
ఈ క్రమంలో ఆ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి తన సహజీవన భాగస్వామికి, పిల్లలకు పెన్షన్ కోరుతూ తాజాగా మరో పిటిషన్ వేశారు. పిటిషనర్ వాదనలను, ప్రభుత్వ వాదనలను పరిశీలించిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. తన భార్య తనతో కలిసి ఉండటం లేదనే విషయాన్ని, మరో మహిళతో సహజీవన బంధాన్ని అతడు దాచిపెట్టలేదని కోర్టు పేర్కొంది. రికార్డులు స్పష్టంగా ఉన్నాయని, పెన్షన్‌లో కోత పెట్టడంలో ఎలాంటి చట్టబద్ధత కనిపించడం లేదని వ్యాఖ్యానించింది.
అదేవిధంగా తన డిపార్ట్మెంట్ను మోసం చేయడం ద్వారా పాస్‌పోర్టులను పొందాలనే దురుద్దేశం కూడా అతడిలో కనిపించడం లేదని కోర్టు పేర్కొన్నది. అలాగే పిటిషనర్ తన భాగస్వామిని, పిల్లలను కుటుంబ పింఛన్లో చేర్చాలంటూ చేసిన అభ్యర్థనను పరిశీలించాలని కేంద్రానికి ఆదేశాలు ఇచ్చింది.