Manoj Shinde : ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు వ్యతిరేకంగా, స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగిన కాంగ్రెస్ రెబెల్ మనోజ్ షిండే.. ఎన్నికలు అయిపోగానే శివసేన గూటికి చేరారు. ఏక్నాథ్ షిండే చేతిలో ఓడిపోయిన మనోజ్ షిండే ఇప్పుడు ఆయన సమక్షంలోనే శివసేన తీర్థం పుచ్చుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఏక్నాథ్ షిండే కోప్రీ పచ్పఖడీ అసెంబ్లీ స్థానం నుంచి షిండే వర్గం శివసేన అభ్యర్థిగా బరిలో దిగారు. అయితే ఆ స్థానం నుంచి మనోజ్ షిండే కాంగ్రెస్ టికెట్ ఆశించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అందుకు ఒప్పుకోలేదు. దాంతో ఆయన ఇండిపెండెంట్గా బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ ఆయనతో నామినేషన్ ఉపసంహరింపజేసేందుకు ప్రయత్నించినా ఆయన అంగీకరించలేదు. దాంతో పార్టీ ఆయనను ఆరేళ్లపాటు సస్పెండ్ చేసింది.
ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి ఏక్నాథ్ షిండే ఘన విజయం సాధించారు. అధికార మహాయుతి కూటమి మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మనోజ్ షిండే శివసేనలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి తాను 40 ఏళ్లుగా సేవ చేస్తూ వస్తున్నానని, అయినా తనకు పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వలేదని మనోజ్ షిండే ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ టికెట్ ఆశిస్తే మొత్తానికి పార్టీ నుంచే బహిష్కరించారని, అందుకే తాను శివసేనలో చేరానని చెప్పారు.