PM Modi | ముంబై: కార్గిల్ యుద్ధం అనంతరం అప్పటి వాజ్పేయి ప్రభుత్వం వెంటనే సమీక్షా కమిటీని ఏర్పాటు చేసిన తరహాలోనే పహల్గాం ఉగ్ర దాడిపై నరేంద్ర మోదీ ప్రభుత్వం అటువంటి ప్రక్రియ ఏదైనా తీసుకుంటుందా అని కాంగ్రె స్ ప్రశ్నించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశాన్ని, ప్రత్యేక పార్లమెంట్ సమాశాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తమ పార్టీ పదేపదే డిమాండు చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్ల ఇన్చార్జి) జైరాం రమేష్ మంగళవారం తెలిపారు. కార్గిల్ యుద్ధం ముగిసిన 3 రోజుల తర్వాత అప్పటి ప్రధాని వాజ్పేయి ప్రభుత్వం కార్గిల్ సమీక్షా కమిటీని ఏర్పాటు చేసిందని ఎక్స్ పోస్టులో జైరాం రమేష్ తెలిపారు. ఆ కమిటీకి భారత వ్యూహాత్మక వ్యవహారాల గురువు కే సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారని, ఆయన కుమారుడే ఇప్పటి విదేశీ వ్యవహారల మంత్రి ఎస్ జైశంకర్ అని వివరించారు.
జాతినుద్దేశించి ప్రధాని మోదీ చేసిన ప్రసంగాన్ని మరో ఏకపాత్రాభినయంగా కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే అభివర్ణించారు. కాల్పుల విరమణ ప్రకటనను ప్రధాని మోదీ కాకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎందుకు చేశారని ఆయన ప్రశ్నించారు. భారత్ తన విదేశాంగ విధానాన్ని అమెరికాకు ఔట్సోర్సింగ్ ఇచ్చిందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘అసలు ఏం జరిగింది?, ఎందుకోసం కాల్పుల విరమణ?, కాల్పుల విరమణకు షరతులు ఏమిటి?, భారత ప్రధాని కాకుండా అమెరికా అధ్యక్షుడు ఎందుకు కాల్పుల విరమణ ప్రకటన చేశారు? వంటి విషయాలన్నిటిపై ప్రభుత్వం నుంచి వివరణ కోరేందుకు ప్రధాని నరేంద్ర మోదీని మేము అఖిల పక్ష సమావేశాన్ని కోరుతున్నాం అని ప్రియాంక్ చెప్పారు.