న్యూఢిల్లీ: రేపు (సోమవారం) జరుగనున్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ఢిల్లీలోనే ఓటు వేస్తారని ఆ పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ వెల్లడించారు. అయితే పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రలో ఉన్నందున.. పోలింగ్ సమయానికి ఆయన ఎక్కడుంటే అక్కడే పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
రాష్ట్రాల్లోని పోలింగ్ బూత్‌ల నుంచి బ్యాలట్ బాక్సులు మంగళవారం ఢిల్లీకి చేరుకుంటాయని మిస్త్రీ తెలిపారు. బుధవారం ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నట్లు చెప్పారు. ఢిల్లీలోని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కార్యాలయంలో కూడా ఒక పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేస్తున్నామని, అక్కడ 50 మందికిపైగా నేతలు ఓటు వేసే అవకాశం ఉందని వెల్లడించారు. పోలింగ్ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, ఇందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని చెప్పారు.
పోలింగ్ సోమవారం ఉదయం 10 గంటలకు మొదలై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందని మిస్త్రీ తెలిపారు. అన్ని రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రతినిధులు తమకు కేటాయించిన పోలింగ్ బూత్‌లలో ఓటు వేస్తారన్నారు. పార్టీ ప్రతినిధులు పోటీలో ఉన్న ఏ అభ్యర్థికైతే మద్దతు ఇవ్వదలుచుకున్నారో ఆ అభ్యర్థి పేరుకు ఎదురుగా టిక్ మార్క్ చేయాలని సూచించారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.