అహ్మదాబాద్: గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, ఆప్, బీజేపీ నేతలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మూడు పార్టీలూ గెలుపే లక్ష్యంగా దూసుకుపోతుండటంతో అక్కడ త్రిముఖ పోటీ నెలకొన్నది. మోదీ సొంత రాష్ట్రంలో పాగా వేయాలని ఆప్ ఉవ్విళ్లూరుతుండగా.. అక్కడ రెండు దశాబ్దాలకు పైగా దూరమైన అధికారాన్ని తిరిగి దక్కించుకునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతున్నది.
ఈ నేపథ్యంలో గుజరాత్లోని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి కాంగ్రెస్ ప్లాన్ చేసింది. జాతీయ స్థాయి నాయకులతో ప్రచార సభలు నిర్వహిస్తున్నది. అందులో భాగంగా పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా గుజరాత్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ నెల 27, 28 తేదీల్లో ఖర్గే ఎన్నికల ప్రచారం చేస్తారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.