Mallikarjun Kharge : బీజేపీ (BJP), ఆరెస్సెస్ (RSS) లపై కాంగ్రెస్ పార్టీ (Congress Party) జాతీయ అధ్యక్షుడు (National President) మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర ఆరోపణలు చేశారు. దేశం కోసం పోరాడిన జాతీయ నాయకులపై కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhai Patel) భావజాలానికి వ్యతిరేకమంటూ విమర్శించారు.
గుజరాత్లోని అహ్మదాబాద్లో మంగళవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ భావజాలానికి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు. స్వాతంత్ర్య సమరంలో ఏమాత్రం పాలు పంచుకోని వాళ్లు ఇప్పుడు పటేల్ వారసులంటూ ప్రకటించుకోవడం హాస్యాస్పదమని చెప్పారు. బీజేపీ, ఆరెస్సెస్ కలిసి జాతీయ నాయకులపై కుట్ర పన్నుతున్నాయని మండిపడ్డారు.
బీజేపీ, ఆరెస్సెస్ దేశంలో మతపరమైన విభజనలకు ప్రయత్నిస్తున్నారని ఖర్గే విమర్శించారు. దేశంలోని ప్రాథమిక సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్లుగా దేశ సేవలో నిమగ్నమై ఉందని, స్వాతంత్ర్య సమరంలో ఎంతో పోరాడిందని అన్నారు. అలాంటి పార్టీకి ప్రస్తుతం దేశంలో వ్యతిరేక పరిస్థితులను సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
దేశం కోసం ఏమీ సాధించని వారే ఇదంతా చేస్తున్నారని ఖర్గే విమర్శించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ మధ్య మంచి అనుబంధం ఉండేదని అన్నారు. ఆ నేతలిద్దరు దేశం కోసం కలిసికట్టుగా పని చేశారని చెప్పారు. అలాంటిది ఆ ఇద్దరు నాయకులు ఒకరితో మరొకరు వ్యతిరేకంగా ఉండేవారని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
నెహ్రూ, పటేల్ మధ్య నిత్యం ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగేవని, అన్ని విషయాలపై నెహ్రూ ఆయన సలహాలు తీసుకునే వారని, పటేల్ అంటే ఆయనకు అమితమైన గౌరవమని ఖర్గే చెప్పారు. ఏదైనా సలహా తీసుకోవాల్సి వస్తే స్వయంగా నెహ్రూనే పటేల్ ఇంటికి వెళ్లేవారని అన్నారు. పటేల్ సౌలభ్యాన్ని దృష్టి ఉంచుకుని సీడబ్ల్యూసీ సమావేశాలు ఆయన ఇంట్లోనే నిర్వహించేవారని గుర్తుచేశారు. అలాంటి గొప్ప నాయకులపై బీజేపీ, ఆరెస్సెస్ కలిసి కుట్ర చేస్తున్నాయని విమర్శించారు.