న్యూఢిల్లీ: భారతీయ స్టాక్ మార్కెట్లను కూల్చేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నినట్లు బీజేపీ నేత రవి శంకర్ ప్రసాద్(Ravi Shankar Prasad) ఆరోపించారు. అదానీ గ్రూపు ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసర్చ్ సంస్థ తాజాగా రిలీజ్ చేసిన రిపోర్టుపై బీజేపీ కౌంటర్ అటాక్ చేస్తోంది. మాజీ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. దేశంలో ఆర్థిక అస్థిరతను కాంగ్రెస్ సృష్టిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. భారత్‌పై ద్వేషం పెరిగేలా చేస్తున్నట్లు పేర్కొన్నారు. భారతీయ మార్కెట్లు చాలా సురక్షితంగా, నిలకడగా, ఆశాజనకంగా ఉన్నట్లు ఆయన చెప్పారు.
మూడవ సారి లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన నేపథ్యంలో.. కాంగ్రెస్ తో పాటు తన టూల్‌కిట్ సిబ్బంది భారతీయ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీస్తున్నట్లు ఆరోపించారు. కంట్రోల్ రాజ్‌ను తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. శనివారమే రిపోర్టు రిలీజైందని, ఆదివారం ఈ అంశం గురించి తీవ్ర స్థాయిలో విష ప్రచారం చేసినట్లు ఆరోపించారు. టూల్ కిట్, చిట్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నట్లు చెప్పారు. కానీ ఇవాళ భారతీయ స్టాక్ మార్కెట్ స్థిరంగా ఉన్నట్లుచెప్పారు. చిన్న ఇన్వెస్టర్లకు సెల్యూట్ చేయాలని, ఎందుకంటే వాళ్లు టూల్ కిట్‌ను, హిండెన్‌బర్గ్‌ను నమ్మలేదన్నారు.
వీదేశీ సంస్థల్లో సెబీ చీఫ్ బధహబ్ పురి బుచ్‌కు పెట్టుబడులు ఉన్నట్లు హిండెన్‌బర్గ్ ఆరోపించింది. ఆ ఆరోపణలను అదానీ గ్రూపు కొట్టివేసింది. హిండెన్‌బర్గ్ విషయంలో న్యాయ ప్రక్రియ చేపట్టడంలో కాంగ్రెస్ విఫలమైనట్లు ప్రసాద్ ఆరోపించారు. సెబీ నోటీసు ఇచ్చిందని, కానీ హిండెన్‌బర్గ్ మాత్రం నిరాధార ఆరోపణలు చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు.ఇప్పటికే సెబీ, చైర్పర్సన్ రిప్లై ఇచ్చినట్లు పేర్కొన్నారు. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జేపీసీ డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. భారతీయ స్టాక్ మార్కెట్లు క్రాష్ కావాలని కాంగ్రెస్ చూస్తున్నదన్నారు. చిన్న ఇన్వెస్టర్లు జీవనాన్ని చిన్నాభిన్నం చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.
కొన్ని ప్రశ్నలు లేవనెత్తాలని భావిస్తున్నానని, హిండెన్‌బర్గ్‌లో ఎవరి పెట్టుబడులు ఉన్నాయని ప్రశ్నించారు. జార్జ్ సోరస్ మీకు తెలుసా, ఆయనే భారత్‌కు వ్యతిరేకంగా విష ప్రచారం చేస్తారని, హిండెన్‌బర్గ్‌లో ఆయనే ప్రధాన పెట్టుబడిదారుడని, మోదీ సర్కారుపై ద్వేషాన్ని చిమ్మడమే ఆ సంస్థ ఉద్దేశమని రవిశంకర్ ఆరోపించారు.