న్యూఢిల్లీ: అయోధ్యలో శ్రీరాముడి ఆలయాన్ని(Ayodhya Ram Temple ) నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆ గుడిని జనవరి 22వ తేదీన ఓపెన్ చేయనున్నారు. అయితే ఆ కార్యక్రమానికి హాజరుకావాలని ఇప్పటికే అన్ని పార్టీలకు ఆహ్వానాలు వెళ్లాయి. కానీ ఆ ఆహ్వానంపై ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. మతపరమైన అంశం విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్న సందిగ్ధంలో పార్టీ ఉన్నట్లు సీనియర్ నేతల ద్వారా వ్యక్తం అవుతోంది. రామాలయ ప్రారంభోత్సవానికి వెళ్లడం లేదని ఇప్పటికే సీపీఎం పార్టీ స్పష్టం చేసింది. కానీ కాంగ్రెస్ తన నిర్ణయాన్ని వెల్లడించకపోవడం ఆ పార్టీలోని గందరగోళ పరిస్థితిని చాటుతోంది.
రాముడి ప్రాణ ప్రతిష్ట కోసం సోనియా గాంధీ లేదా కాంగ్రెస్ బృందం వెళ్లే ఛాన్సు ఉన్నట్లు ఇటీవల ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. కానీ సోనియా గాంధీ మాత్రం ఇప్పటి వరకు ఈ అంశంపై అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ అంశంలో ఆమె పాజిటివ్‌గా ఉన్నట్లు దిగ్విజయ్ ఇటీవల మీడియాతో చెప్పారు. పార్టీ వైఖరి ఏంటన్న అంశం త్వరలోనే తెలుస్తుందని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అన్నారు. హిందుత్వవాదులను తన వైపు తిప్పుకున్న బీజేపీ.. ఇప్పుడు రామాలయం అంశంతో విపక్ష పార్టీలను ఇరుకునపడేసింది.
మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కన్నా తానే ఎక్కువ విరాళం ఇచ్చినట్లు దిగ్విజయ్ సింగ్ ఓ సందర్భంలో పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్.. కేవలం సెక్యులర్ వాయిస్ వినిపించాలని భావిస్తున్నది. దీంతో అయోధ్య అంశంపై ఆ పార్టీలో క్లారిటీ లేకుండా పోయింది. వివాదాస్పద బాబ్రీ మసీదును కూల్చి ఆ స్థలంలో రామ మందిరాన్ని నిర్మించారు. ఇప్పుడు రాముడి ఆలయం ఓపెనింగ్ ఈవెంట్‌కు హాజరు కావడం ఎలా అన్న ఆలోచనల్లోనూ కాంగ్రెస్ ఉన్నట్లు అర్థమవుతోంది.
ఐడియాలజీ విషయంలో సీపీఐ, సీపీఎం పార్టీలు ఫుల్ క్లారిటీతో ఉన్నాయి. మతాన్ని రాజకీయంగా చూడలేమని, అందుకే రామాలయ ఈవెంట్‌కు హాజరుకావడం లేదన్న ఏచూరి చెప్పేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా హాజరుకావడం లేదని కొన్ని వర్గాల ద్వారా స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ అంశంపై ఇప్పుడు కన్ఫ్యూజన్ నెలకొన్నది. అగ్ర నాయకత్వం తీసుకునే నిర్ణయంపైనే ఆ పార్టీ నేతలు ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ త్వరలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని ఎంపీ శశి థరూర్ అన్నారు. సీపీఎంకు మతపరమైన విశ్వాసాలు ఉండవని, అందుకే వాళ్లకు నిర్ణయం తీసుకోవడం సులువైందని, కానీ హిందుత్వ రాజకీయ ఐడియాలజీగా మారిందని, ఇది హిందూ మతంతో సంబంధం లేదని, మేం సీపీఎం కాదు, బీజేపీ కాదు అని, అందుకే ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడం ఆలస్యం అవుతోందని శశి థరూర్ అన్నారు.