Congress party : జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి (Jammu & Kashmir CM) , నేషనల్ కాన్ఫరెన్స్ (National Conference) అగ్రనేత ఒమర్ అబ్దుల్లా (Omar abdullah) పై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈవీఎంల విషయంలో తమ అభిప్రాయాన్ని తప్పుపడుతూ ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం పదవి దక్కగానే ఈవీఎంల విషయంలో ఒమర్ అబ్దుల్లా మాట ఎందుకు మారిందని కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్కం ఠాగూర్ ప్రశ్నించారు.
ఈవీఎంలకు వ్యతిరేకంగా సమాజ్వాదీ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఉద్ధవ్ థాకరే వర్గం శివసేన పార్టీ బహిరంగంగా మాట్లాడాయని, తాము కాదని, ఒమర్ అబ్ధుల్లా నిజాలు తెలుసుకుని మాట్లాడాలని మాణిక్కం ఠాగూర్ అన్నారు. తాము ఈవీఎంల పనితీరుపై అనుమానం వ్యక్తంచేస్తూ సీడబ్ల్యూసీలో చేసిన తీర్మానాన్ని కేవలం కేంద్ర ఎన్నికల సంఘానికి మాత్రమే ఇచ్చామని తెలిపారు.
ప్రతిపక్ష కూటమిలో భాగస్వామి అయి ఉండి, సీఎం కాగానే ఒమర్ అబ్ధుల్లా ఎందుకు మాట మార్చారో అని ఠాగూర్ వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీకి కనీసం 10 శాతం సీట్లు కూడా రాకపోవడంతో ఈవీఎంలపై మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి.