లక్నో: ఎన్నికల వేళ నాయకులు పార్టీలు మారడం సాధారణమే. కాంగ్రెస్ పార్టీకి (Congress) చెందిన ఓ లీడర్ కూడా సమాజ్వాదీ పార్టీలోకి జంప్ అయ్యాడు. ఎన్నికల సీజన్ కాబట్టి టికెట్ నిరాకరించినందుకు పార్టీ మారిండు అనుకోకండి.. ఆయన ఓ నియోజకర్గం నుంచి పోటీ చేస్తున్నాడు. మరి ఓ ఎమ్మెల్యే అభ్యర్థి పార్టీ మారడం ఏంటనుకుంటున్నారా.. అవును పార్టీ ద్వితీయశ్రేణి నాయకత్వంపై కోపంతో సైకెలెక్కేశాడు.
ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సలీం ఖాన్ (Salim Khan) పోటీ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి గురించి పార్టీ అగ్రనాయకత్వానికి వివరించడానికి ఆయన ప్రయత్నించారు. దీనికోసం సీనియర్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీని కలవాలనుకున్నారు. అయితే పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు దీనికి ఒప్పుకోలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆయన సమాజ్వాదీ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో సమన్వయ లోపం ఉన్నదని, అందుకే ఎస్పీలో చేరానని ఆయన వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఏడు విడతలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడత ఎన్నికల పోలింగ్ గత గురువారం పూర్తయింది. యూపీ అసెంబ్లీలో 403 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. మొత్తం 15 కోట్ల మంది ఓట్లు వేయనున్నారు. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.