(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): ‘నిలకడ లేని స్నేహం ఆ పార్టీ నైజం. మిత్ర ధర్మమంటే అసలు లెక్కలేదు. స్వార్థ రాజకీయాల కోసం, పదవుల కోసం నమ్మక ద్రోహానికి కూడా వెనుకాడబోదు. అవకాశవాదానికి, వెన్నుపోటుకు చిరునామా ఆ పార్టీ’.. కాంగ్రెస్ పార్టీ గురించి బుధవారం సోషల్‌మీడియాలో నెటిజన్లు పెద్దయెత్తున చేసిన కామెంట్లు ఇవి. మంత్రి పదవుల కోసం నటుడు విజయ్‌కు చెందిన టీవీకే పార్టీకి బుధవారం కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. దీని కోసం డీఎంకేతో 55 ఏండ్లుగా కొనసాగుతున్న సుదీర్ఘ పొత్తుకు గుడ్‌బై చెప్పింది. కాంగ్రెస్ తాజా నిర్ణయంపై డీఎంకే నేతలతో పాటు నెటిజన్లు కూడా పెద్దయెత్తున దుమ్మెత్తి పోస్తున్నారు. నమ్మిన మిత్రులను నట్టేట ముంచడం కాంగ్రెస్‌కు కొత్తేమీ కాదని మండిపడుతున్నారు.
మిత్ర పక్షం ఓడితే సంబురాలు
ఒక్క డీఎంకేనే కాదు.. గతంలోనూ మిత్ర పక్షాలకు కాంగ్రెస్ చెయ్యిచ్చిందంటూ నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. బెంగాల్ ఎన్నికల్లో మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పరాజయం పాలైతే కాంగ్రెస్ నేతలు తొలుత సంబురాలు చేసుకొన్నారంటూ ఆ ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్న ఇండియా కూటమిలో టీఎంసీ భాగస్వామిగా ఉన్నది.
స్నేహితులపైనే యుద్ధం
తాము నేతృత్వం వహిస్తున్న ఇండియా కూటమిలోని మిత్ర పక్షాలపై కూడా కాంగ్రెస్ డైరెక్టుగా యుద్ధాన్ని ప్రకటించిందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇండియా కూటమిలోనే భాగస్వామ్య పక్షాలుగా ఉన్న లెఫ్ట్ పార్టీలపై కాంగ్రెస్ తీరు ఇలాగే ఉన్నదంటున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తెలంగాణలో లెఫ్ట్ పార్టీల మద్దతును కూడగట్టిన కాంగ్రెస్.. కేరళలో మాత్రం అదే వామపక్షాలపై కత్తులు దూసిందని గుర్తు చేస్తున్నారు. విజయన్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి నోరుపారేసుకొన్న వీడియోలను నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. ఇక, పంజాబ్, ఢిల్లీ ఎన్నికల్లో తమ కూటమిలోని మిత్రపక్షం ఆప్‌కి వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
విశ్వాసం లేని భాగస్వామి కాంగ్రెస్
టీవీకే పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంపై డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై మండిపడ్డారు. కాంగ్రెస్‌ను వెన్నుపోటుదారుల పార్టీగా అభివర్ణించారు. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన ఐదు సీట్లు కూడా స్టాలిన్ పెట్టిన భిక్షేనని ఘాటుగా వ్యాఖ్యానించారు. డీఎంకే మద్దతు లేకపోతే, తమిళనాడులో కాంగ్రెస్ ఒక్క సీటైనా గెలిచేదా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీని బీజేపీ నేతలు ‘పప్పు’ అని ట్రోల్ చేస్తుంటే, అందరి కంటే ముందుగా స్టాలినే ఆ వ్యాఖ్యలను ఖండించి, రాహుల్‌కు బాసటగా నిలిచారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ను ఓ విశ్వాసం లేని భాగస్వామిగా అభివర్ణించారు. 2029 ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యమని పైకి చెప్తున్న కాంగ్రెస్, క్షేత్ర స్థాయిలో మాత్రం మిత్ర పక్షాలకు వెన్నుపోటు పొడుస్తున్నదని ధ్వజమెత్తారు.