Congress | హైదరాబాద్, డిసెంబర్ 20 (స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ): దేశాన్ని 50 ఏండ్లకు పైగా పాలించిన కాంగ్రెస్ ఇప్పుడు దేశ ప్రజలను చందాలు అడుగుతున్నది. కాంగ్రెస్ను ఆర్థికంగా పరిపుష్టం చేయాలని క్రౌడ్ ఫండింగ్ చేపట్టినట్టు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ ప్రకటించారు. కానీ దీని అసలు ఉద్దేశం అదేనా, 138 ఏండ్ల చరిత్ర కలిగిన ఆ పార్టీకి నిధుల కొరత నిజమేనా అన్న చర్చ జరుగుతోంది. రూ.800 కోట్ల ఆస్తులతో దేశంలో రెండో ధనిక పార్టీ అయిన కాంగ్రెస్ ఇటీవల తమ ఆదాయం 29 శాతం తగ్గిపోయిందని చెప్తున్నది.
బ్లాక్ మనీని వైట్ చేసేందుకా?!
కాంగ్రెస్ తాజాగా చందాలడగడానికి గల కారణాలను రాజకీయ పరిశీలకులు మూడు రకాలుగా విశ్లేషిస్తున్నారు. అందులో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవటానికి నిధుల సమీకరించడమని చెబుతూనే, బడా బాబుల బ్లాక్ మనీని వైట్ చేయడానికి కూడా ఈ ఎత్తు వేశారని కొందరు విశ్లేషిస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు రాకుండా బడా కంపెనీలను నియంత్రిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పెద్దలకు చెక్ పెట్టటానికి ఈ ఎత్తు వేశారని కొందరు విశ్లేషకులు అంటున్నారు.
సానుభూతి పొందడానికే!
కాంగ్రెస్ బీద పార్టీ అని, ఎన్నికల ఖర్చుల కోసం డబ్బులు లేవని సామాన్యుల సానుభూతి పొందేందుకు ఇంటింటా చందాల పేరిట దగ్గరవ్వాలన్నది కాంగ్రెస్ పార్టీ వ్యూహమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో అత్యధిక కాలం తాము అధికారంలో ఉన్నా, బీజేపీ దగ్గర ఉన్నంత డబ్బు తమ దగ్గర లేదని ప్రజలకు వివరించాలన్నది మరో వ్యూహమట. బీజేపీ వద్ద ఇప్పుడు 6 వేల కోట్లకు పైగా ధనం ఉందని, అదంతా బడా బాబుల దగ్గర వసూలు చేసిందేనని ప్రజలకు చెప్పి సానుభూతి పొందేందుకు కాంగ్రెస్ పెద్ద ఎత్తుగడ వేసిందని కొందరు విశ్లేషిస్తున్నారు.