న్యూఢిల్లీ, జూన్ 13: గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.2,100 కోట్ల మేర జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని, ఆ పార్టీ ఎమ్మెల్యే కవాసీ లఖ్మాకు చెందిన ఆస్తులను ఈడీ శుక్రవారం జప్తు చేసింది. పీఎంఎల్ఏ నిబంధనల కింద ఆస్తుల జప్తుపై ఈడీ ఉత్తర్వులు జారీచేసింది. 72 ఏండ్ల లఖ్మా, ఆయన కుమారుడు హరీశ్ లఖ్మా ఆస్తులతోపాటు సుక్మా జిల్లాలోని పార్టీ కార్యాలయ భవనాన్ని ఈడీ జప్తు చేసుకుంది. వీటి మొత్తం విలువ రూ. 6.15 కోట్లు. రాయ్‌పూర్, సుక్మా, ధంతరీలోని లఖ్మా నివాసాలపై గత ఏడాది డిసెంబర్లో ఈడీ దాడులు చేయడంతోపాటు అరెస్టులూ చేసింది. కోంట అసెంబ్లీ స్థానానికి ఆరుసార్లు ప్రాతినిధ్యం వహించిన లఖ్మా మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ నేతృత్వంలోని గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్సైజ్ మంత్రిగా పనిచేశారు.