చండీఘఢ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలను ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్ధులను మట్టికరిపించేందుకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రశాంత్ కిషోర్ టీం పార్టీకి సహకరిస్తారని పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్ని ఇటీవల ఓ న్యూస్ చానెల్‌తో మాట్లాడుతూ సంకేతాలివ్వడం ఈ ఊహాగానాలకు ఊతమిస్తోంది.
గతంలో పలు పార్టీల ఎన్నికల ప్రచారాలకు పదును పెట్టిన ప్రశాంత్ కిషోర్‌తో కాంగ్రెస్ వ్యూహాలను పంచుకోవాలని పంజాబ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ హరీష్ చౌదరి ఇటీవల తనతో చెప్పారని చరణ్‌జిత్ వెల్లడించారు. మరోవైపు మాజీ సీఎం, కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీని ఏర్పాటు చేసి బీజేపీతో చేతులు కలిపి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.