బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌లో వర్గ పోరు జరుగుతున్నదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. బంగారం అక్రమ రవాణా కేసులో రాష్ట్ర హోం మంత్రి జీ పరమేశ్వరకు చెందిన విద్యా సంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడుల నేపథ్యంలో కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ప్రహ్లాద్ తిప్పికొట్టారు. కాంగ్రెస్ పార్టీలోని వారే ఈడీకి ఫిర్యాదులు చేశారని చెప్పారు. కాంగ్రెస్‌లోని కొందరు నేతలు పరమేశ్వరకు వ్యతిరేకంగా సమాచారాన్ని ఇస్తూనే, నాటకాలు ఆడుతున్నారని పేర్కొన్నారు.
ఆయనపై ఫిర్యాదులు పంపిస్తుండటం గురించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు తెలుసునని చెప్పారు. ఆయన పరిధిలోనే నిఘా విభాగం ఉందని, ఆయనను అడగాలని సలహా ఇచ్చారు. బంగారం అక్రమ రవాణా కేసులో నిందితురాలు రన్యా రావు క్రెడిట్ కార్డు బిల్లు కోసం ఓ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నుంచి రూ.40 లక్షలు బదిలీ అయినట్లు గుర్తించామని ఈడీ తెలిపింది. ఈ నేపథ్యంలో పరమేశ్వరకు చెందిన విద్యా సంస్థల్లో ఈడీ సోదాలు చేసింది. మనీలాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నది.