Ashok Chavan : మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ కాంగ్రెస్ పార్టీని వీడి కాషాయ పార్టీలో చేరడంపై సీనియర్ కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఓ నేత వ్యవహార శైలితోనే అశోక్ చవాన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని అన్నారు. అశోక్ చవాన్ పార్టీకి కచ్చితంగా గొప్ప నేతని, కొందరు ఆయన పార్టీకి భారమని, మరికొందరు ఈడీ నుంచి తప్పించుకునేందుకే పార్టీని వీడారని చెబుతున్నా మహారాష్ట్రకు చెందిన ఓ నేత పనితీరుతో విసుగు చెంది అశోక్ చవాన్ పార్టీని వీడారని సంజయ్ నిరుపమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ విషయాన్ని పార్టీ నాయకత్వం దృష్టికి చవాన్ తీసుకొచ్చినా పట్టించుకోలేదని వాపోయారు. పార్టీ తీరుతో విసిగిన చవాన్ కాంగ్రెస్‌కు రాజీనామా చేయాల్సిన పరిస్ధితిని తీసుకువచ్చారని అన్నారు. క్షేత్రస్ధాయిలో గట్టి పట్టుఉన్న చవాన్ కాంగ్రెస్‌ను వీడటం పార్టీకి గట్టి ఎదురుదెబ్బేనని వ్యాఖ్యానించారు.
మహారాష్ట్రలో పార్టీ నేతలు బాబా సిద్ధిఖి, మిలింద్ దియోరా వంటి నేతలు రాజీనామా చేసిన క్రమంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు చవాన్ సైతం కాంగ్రెస్‌ను వీడటం ఆ పార్టీకి ఇబ్బందికరమేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడం తన వ్యక్తిగత నిర్ణయమని ఆదర్శ్ బిల్డింగ్ స్కామ్‌పై శ్వేతపత్రం అంశానికి తన రాజీనామాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాగా, ఆదర్శ్ బిల్డింగ్ స్కామ్ కారణంగా 2010లో అశోక్ చవాన్ మహారాష్ట్ర సీఎంగా రాజీనామా చేయాల్సి వచ్చింది.
Read More :