మాంసం తిని గుడికి వెళ్లారని తనపై వచ్చిన ఆరోపణలపై కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య స్పష్టత ఇచ్చారు. ఆ రోజు తాను మాంసమే ముట్టలేదని వెల్లడించారు. అసలది ఒక ఇష్యూనే కాదంటూనే ఆహార ఎంపిక అనేది మనిషికున్న హక్కు అని నొక్కిచెప్పారు. ఈ నెల 18న కొడ్లిపేటలోని బసవేశ్వర ఆలయంలోకి సిద్ధరామయ్య ప్రవేశించడం వివాదానికి దారితీసింది, ఆయన ఆ రోజు మాంసాహారం తిన్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. మాంసం తిని గుడిలోకి ప్రవేశించారని ప్రచారం చేశారు.
దీనిపై సిద్దరామయ్య మంగళవారం క్లారిటీ ఇచ్చారు. ‘మాంసం తినడం సమస్యా? ఒకరు ఏమి తింటారు అనేది వ్యక్తిగత ఆహార అలవాటు. నేను మాంసాహారం, శాఖాహారం రెండూ తింటాను.. అది నా అలవాటు. కొందరు మాంసం తినరు.. అది వారి ఆహారపు అలవాటు’ అని సిద్ధరామయ్య ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. బీజేపీకి వేరే పని లేదని, అందుకే ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు వివాదాలు సృష్టిస్తున్నదని మండిపడ్డారు.
‘నా అభిప్రాయం ప్రకారం..ఇది అస్సలు సమస్య కాదు. చాలా మంది మాంసం తినకుండా ఉంటారు. చాలామంది తింటారు. చాలా చోట్ల దేవతలకు మాంసం నైవేద్యంగా పెడతారు. నిజం చెప్పాలంటే, నేను ఆ రోజు మాంసం తినలేదు. చికెన్ కర్రీ ఉన్నప్పటికీ, నేను వెదురు చిగురు కూర, రొట్టె మాత్రమే తిన్నాను’ అని సిద్ధరామయ్య స్పష్టంచేశారు.