లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సుల్తాన్పూర్ జిల్లాలో రీటా యాదవ్ (35) అనే మహిళా కాంగ్రెస్ నాయకురాలిపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. జిల్లాలోని లక్నో-వారణాసి హైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల్లో రీటా యాదవ్ కాలులోకి బుల్లెట్ దూసుకుపోయింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆమెకు ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు తెలిపారు. రీటా గత నెలలోనే సమాజ్‌వాది పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు.
కాగా, గత నవంబర్ 16న ప్రధాని మోదీ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించిన అనంతరం సుల్తాన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించారు. ప్రధాని ప్రసంగం కొనసాగుతుండగా రీటా యాదవ్ నల్లజెండా ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. దాంతో పోలీసులు ఆమెను సభాప్రాంగణం నుంచి బయటికి లాక్కెళ్లి అరెస్ట్ చేశారు. అనంతరం హెచ్చరించి వదిలేశారు. ఈ ఘటన జరిగినప్పుడు రీటా యాదవ్ సమాజ్‌వాది పార్టీలో ఉన్నారు.
తాజాగా ఆమెపై కాల్పులు జరుగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లక్నో-వారణాసి హైవేపై కారులో వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు తన డ్రైవర్‌కు తుపాకులు చూపించి బలవంతంగా ఆపారు. అనంతరం తనపై కాల్పులు జరిపి పారిపోయారని రీటా యాదవ్ చెప్పారు. అప్పుడు తాను కారు సీట్ల మధ్య నక్కడంతో ప్రాణాపాయం తప్పిందన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.