Sachin Pilot : జార్ఖండ్‌లోని చక్రధర్పూర్ వద్ద రైలు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం హౌరా – సీఎస్ఎంటీ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. 20 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. దేశంలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న రైలు ప్రమాదాలతో మోదీ సర్కార్ లక్ష్యంగా విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. జార్ఖండ్ రైలు ప్రమాద ఘటనపై కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ మాట్లాడుతూ ఎవరు అధికారంలో ఉన్నా ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించడమే తొలి ప్రాధాన్యతగా ఉండాలని అన్నారు.
ప్రజా రవాణా విషయంలో భద్రత అత్యంత కీలకమని పేర్కొన్నారు. గత కొద్దినెలలుగా నిరోధించతగిన రైలు ప్రమాదాలు వెలుగుచూడటం బాధాకరమని సచిన్ పైలట్ అన్నారు. ఇక జార్ఖండ్ రైలు ప్రమాద ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ఇటీవల రైలు ప్రమాద ఘటనలు సర్వసాధారణమైపోయాయన్నారు.
ప్రతివారం ఏదో ఒకచోట ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ‘మరో ఘోరమైన రైలు ప్రమాదం..! ఈ రోజు తెల్లవారుజామున జార్ఖండ్‌లోని చక్రధర్పూర్ డివిజన్లో హౌరా – ముంబై మెయిల్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో కొందరు చనిపోగా.. భారీ సంఖ్యలో గాయపడ్డారు. దేశంలో రైలు ప్రమాద ఘటనలు సర్వసాధారణమైపోయాయి. ప్రతి వారం ఏదో ఒకచోట ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో నేను ప్రభుత్వాన్ని గట్టిగా అడుగుతున్నాను.. ఇంకా ఎంతకాలం వీటిని సహించాలి. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి అంతం ఉండదా..?’ అని ఎక్స్ వేదికగా మోదీ సర్కార్‌ను దీదీ నిలదీశారు.
Read More :
Srisailam Project | శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. మరో రెండు గేట్లు ఎత్తివేత