Kanhaiya Kumar | ముంబై, నవంబర్ 14 : మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతను ఉద్దేశించి కాంగ్రెస్ నాయకుడు కన్హయ్య కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. బుధవారం నాగ్‌పూర్‌లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల ప్రచార ర్యాలీలో కన్హయ్య ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికలను రాష్ట్రంలో ఓట్ జిహాద్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ధర్మ యుద్ధంగా పోలుస్తూ ఇటీవల దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలకు కన్హయ్య కౌంటర్ ఇచ్చారు.
‘మతాన్ని కాపాడే బాధ్యత మనది.. వారి పిల్లలు మాత్రం ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాల్లో చదువుతారు. డిప్యూటీ సీఎం భార్య ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం సరికాదు. మతాన్ని కాపాడుకోవాలంటే అందరం కలిసి కాపాడుకుందాం.’ అంటూ కన్హయ్య వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ‘మహారాష్ట్ర ఆడబిడ్డను అవమానించేందుకు మీకెంత ధైర్యం? ఈ వ్యాఖ్యలు ప్రతీ మరాఠీ మహిళకు అవమానం’ అంటూ బీజేపీ అధికార ప్రతినిధి షెహ్జాద్ పూనావాలా ‘ఎక్స్’లో పేర్కొన్నారు.