Modi 3.0 : మోదీ 3.0 వంద రోజుల పాలనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వంద రోజుల పాలన అంతా అస్ధిరత, సంక్షోభాలమయమని దుయ్యబట్టారు. దేశంలో ఉపాధి అవకాశాలు సృష్టించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఎక్స్ పోస్ట్‌లో జైరాం రమేష్ పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం నిన్న వంద రోజుల అస్ధిర, సంక్షోభ పాలనను పూర్తిచేసుకుంది..భారత నిరుద్యోగ సంక్షోభానికి కేంద్ర బిందువుగా మరో వైఫల్యంతో ఈ మైలురాయిని చేరుకుందని ఈ పోస్ట్‌లో కాంగ్రెస్ నేత రాసుకొచ్చారు.
ఉపాధిలో భారత్ దాదాపు సున్నా వృద్ధి రేటు సాధించిందని అంతర్జాతీయ కార్మిక సంస్ధ (ILO) ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్, 2024 వెల్లడించిందని పేర్కొన్నారు. ఐఎల్ఓ నివేదిక ప్రకారం ఏటా 70-80 లక్షల మంది కార్మిక శక్తిలో చేరుతుంటే, 2012 నుంచి 2019 వరకూ ఉద్యోగితలో దాదాపు సున్నా వృద్ధి రేటు నమోదైందని పేర్కొందని పెదవివిరిచారు. అదే నివేదికలో 2022లో నగర యువతలో నిరుద్యోగం అత్యధికంగా 17.2 శాతంగా నమోదైందని గుర్తుచేశారు. గ్రామీణ యువతలో నిరుద్యోగ రేటు 10.6 శాతంగా ఉందని చెప్పారు.
అసంఘటిత రంగంలో ఉద్యోగాలు పెరుగుతున్నా సంఘటిత రంగంలో ఉద్యోగాలు 10.5 శాతం నుంచి 9.7 శాతానికి తగ్గాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి సామాజిక భద్రత లేని తక్కువ వేతనాలతో కూడిన అసంఘటిత రంగ ఉద్యోగాల శాతం పెరిగినట్టు మోదీ ప్రభుత్వం చూపుతున్నదని ఐఎల్ఓ నివేదిక వెల్లడించిందని అన్నారు. 2019-22 మధ్య సంఘటిత రంగ ఉద్యోగాలు క్షీణించాయని, సిటీ గ్రూప్ కూడా ఇదే ట్రెండ్‌ను వెల్లడించిందని తెలిపారు. భారత శ్రామిక శక్తిలో కేవలం 21 శాతమే వేతనాలు పొందే ఉద్యోగాల్లో పనిచేస్తున్నారని ఈ నివేదిక తెలిపిందని జైరాం రమేష్ వివరించారు.
Read More :
Wheat Prices | పండుగలకు ముందు సామాన్యులకు షాక్.. భారీగా పెరుగుతున్న గోధుమ పిండి ధరలు..!