Jairam Ramesh : హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుండగా కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌పై కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల ఫలితాల ట్రెండ్స్‌ను ఈసీఐ వెబ్సైట్ తప్పుదారి పట్టిస్తోందని ఆయన ఆరోపించారు. అప్డేటెడ్ ట్రెండ్స్‌ను ఈసీ చాలా నెమ్మదిగా అప్లోడ్ చేస్తోందని విమర్శించారు.
‘పాతబడిన, తప్పుదారి పట్టించే సమాచారాన్ని షేర్ చేయాలని అధికార యంత్రాంగంపై బీజేపీ ఒత్తిడి తెస్తోందా’ అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తాము ఈసీకి మెమొరాండం సమర్పిస్తామని, ఫిర్యాదు చేస్తామని, మా ప్రశ్నలకు ఈసీ సమాధానం ఇస్తుందనే అనుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే 10-11 రౌండ్ల ఫలితాలు బయటకు వచ్చాయని, కానీ ఈసీ వెబ్సైట్ 4-5 రౌండ్ల ఫలితాలనే అప్లోడ్ చేసిందన్నారు.
అయితే జైరామ్ రమేష్ ఆరోపణలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. మీ ఆరోపణలు పూర్తిగా ఊహాజనితమని, బాధ్యతారహితంగా ఉన్నాయని పేర్కొంది. నిరాధార ఆరోపణలతో తప్పుదారి పట్టించవద్దని సమాధానమిచ్చింది.