తృణమూల్ కాంగ్రెస్‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఎన్నికైన అభ్యర్థులకు 10 నుంచి 20 కోట్లిచ్చి, కొనుగోలు చేస్తున్నారని,ఈ విధానంతో వారందర్నీ తృణమూల్‌లోకి తీసుకుంటున్నారని కాంగ్రెస్ గోవా ఇన్చార్జీ దినేశ్ గుండూరావు ఆరోపించారు. గోవాలో కాంగ్రెస్‌ను బలహీనపరిచి, బీజేపీకి లాభం చేకూర్చే పనిలో మమత నిమగ్నమయ్యారని ఆయన మండిపడ్డారు. తృణమూల్ పార్టీ అసలు గోవాకు ఏం చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏమీ చేయకుండానే కోట్లాది రూపాయలతో ఇక్కడికి వచ్చి, అభ్యర్థుల కొనుగోళ్లకు తెరలేపారని తీవ్రంగా మండిపడ్డారు. తృణమూల్‌కు ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని, ఏ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఇలాంటి పనులకు తెరలేపుతున్నారని ఆయన ప్రశ్నించారు. బీజేపీకి లాభం చేకూర్చడానికే తృణమూల్ ఇలాంటి పనులు చేస్తోందని ఆరోపించారు. బీజేపీకి లాభం చేకూర్చడానికే మమత ప్రయత్నిస్తుంటే, ఆమెతో పొత్తు ఎలా పెట్టుకుంటామని గుండూ రావు ప్రశ్నించారు.