మమతా బెనర్జీ సీఎంగా ఉన్న బెంగాల్లో వెంటనే ఆర్టికల్ 355ని విధించాలని కాంగ్రెస్ ఎంపీ, బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు ఓ లేఖ రాశారు. శాంతిభద్రతలు బెంగాల్లో ఘోరంగా దిగజారిపోయాయని, గత ఒక్క నెలలోనే రాష్ట్రంలో 26 రాజకీయ హత్యలు జరిగాయని అధీర్ ఆ లేఖలో ప్రస్తావించారు. తాజాగా… బీర్భూమ్ జిల్లాలో జరిగిన సజీవ దహనం సంఘటనను కూడా అధీర్ తన లేఖలో ప్రస్తావించారు. ఇలాంటి ఘటనలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని, బెంగాల్లో 355 ఆర్టికల్‌ను విధించాలని అధీర్ రంజన్ రాష్ట్రపతిని కోరారు.
‘సబీర్భూమ్ జిల్లాలో రెండు గ్రూపుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. టీఎంసీ నేత బదూ షేక్‌ను హత్య చేశారు. దీనికి ప్రతీకారంగా ఆ ప్రాంతంలోని ఇళ్లపై దాడులు చేసి, నిప్పంటించారు. ఈ దాడిలో 12 మంది చనిపోయారు. అందులో పసిపిల్లలు, మహిళలు కూడా వున్నారు. పోలింగ్ ముందు, పోలింగ్ తర్వాత చాలా మంది బతుకులు బుగ్గిపాలయ్యాయి. ఇప్పటికీ ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.’ అంటూ అధీర్ ఆ లేఖలో పేర్కొన్నారు.
355 ఆర్టికల్ అంటే..?
దేశంలో ఏదైనా రాష్ట్రంపై బయటి నుంచి వచ్చే విపత్తులు వస్తే రక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. అలాగే రాష్ట్రాల్లో అంతర్గతంగా కలహాలు జరిగినా రక్షించాల్సిన బాధ్యత కేంద్రానికి ఉంటుంది. ప్రతిరాష్ట్రంలో ప్రభుత్వం రాజ్యాంగలోని నిబంధనలను అనుసరించి నడిచేలా చూడటం కూడా కేంద్రం బాధ్యతే.