Omar Abdulla on Congress | కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తేల్చేశారు. కేంద్రంలోని అధికార బీజేపీపై పోరాడుతుందని కాంగ్రెస్ పార్టీపై అత్యాశ పెట్టుకోవద్దని ఎద్దేవా చేశారు. వివిధ రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ నేతలు కుమ్ములాటలో మునిగి తేలుతున్నారని, ఈ టైంలో పార్టీ పోరాట పటిమ ప్రదర్శిస్తుందని ఆశించడం సరికాదని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ వేసే అడుగుల ప్రభావం ఎన్డీయేతర కూటమిలో ఉన్న ప్రతి పార్టీపైనా ఉంటుందని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. పంజాబ్ సీఎం అమరీందర్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీపై పోరుకు ఏకతాటిపై నడవాలని విపక్షాలన్నీ నిర్ణయించాయి. కానీ కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల్లో మునిగి తేలుతుండటంపై ఒమర్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
నవజ్యోత్ సింగ్ సిద్ధూ కాంగ్రెస్లో చేరిన రోజే కెప్టెన్ అమరిందర్ సింగ్ రాజీనామా స్క్రిప్ట్ సిద్ధమైందని హర్యానా మంత్రి అనిల్ విజ్ వ్యాఖ్యానించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సీఎంలను మార్చే పనిలో పడ్డాయని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది.