న్యూఢిల్లీ: స్వాతంత్ర్య సంగ్రామాన్ని నడిపించిన వందేమాతరం గేయానికి ఎట్టకేలకు గుర్తింపు వచ్చిందని, ఆ గేయం జాతి గర్వకారణం అని, కానీ ఆ గేయంలో ఉన్న దుర్గామాత చరణాలను కాంగ్రెస్ పార్టీ తొలగించిందని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్(Kangana Ranaut) అన్నారు. ఇవాళ లోక్‌సభలో వందేమాతరం గేయం గురించి చర్చ జరిగింది. ఆ చర్చలో ప్రధాని మోదీ మాట్లాడుతూ వందేమాతరం గీతాన్ని కాంగ్రెస్ ముక్కలు చేసినట్లు ఆరోపించారు. ఆ అంశం గురించి ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. పార్లమెంట్ ఆవరణలో రిపోర్టర్లతో ఆమె మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సంగ్రామాన్ని నడిపించిన గీతానికి ఇప్పుడు క్రెడిట్ దక్కడం గర్వకారణం అన్నారు. ఆ గేయంలోని దుర్గామాత చరణాలను తొలగించారని, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మహిళా వ్యతిరేకి అని ఆమె ఆరోపించారు.
వందేమాతం గీతంలో ఉన్న దుర్గాదేవి చరణాలను 1937లో తొలగించినట్లు ఇటీవల బీజేపీ నేత సీఆర్ కేశవన్ పేర్కొన్నారు. కొన్ని వర్గాల ప్రజలను సంతోషపెట్టేందుకు నెహ్రూ ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆ గేయంలో ఉన్న తొలి రెండు చరణాలను మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఆమోదించిందన్నారు. దీంతో ఆ సాంగ్‌పై ఇప్పుడు కొత్తగా చర్చ మొదలైంది. వందేమాతం గీతం గురించి ఎన్నో ఏళ్లుగా చర్చ సాగుతోందని, ఆ పాట గురించి అందరికీ తెలియాలని, మన సంస్కృతి, సంప్రదాయం, చరిత్ర గురించి తెలుసుకోవాలని బీజేపీ ఎంపీ అరుణ్ గోవిల్ అన్నారు.