కొప్పల్(కర్ణాటక), జనవరి 6: కర్ణాటకకు చెందిన అధికార కాంగ్రెస్ శాసనసభ్యుడు రాఘవేంద్ర హిత్మల్ సొంత పార్టీ ఇచ్చిన హామీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన ఐదు గ్యారెంటీ పథకాల అమలు రాష్ట్ర అభివృద్ధికి అవరోధంగా మారిందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కొప్పల్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
కొప్పల్ తాలూకాలోని కునికేరిలో ఆదివారం కొత్త పోస్టాఫీసు భవనానికి భూమి పూజ సందర్భంగా హిత్మల్ ప్రసంగించారు. కునికేరి గ్రామం కోసం అనేక కార్యక్రమాలు/ప్రాజెక్టులను రూపొందించామని, అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు గ్యారెంటీ పథకాల కారణంగా వాటి పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆయన అన్నారు. గ్యారెంటీలపై రూ. 54,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని, నిధుల మళ్లింపు వల్ల అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని హిత్మల్ చెప్పారు.