బెంగళూరు, జూలై 19: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం పౌరులపై మరో బాదుడుకు తెర తీసింది. తాజాగా సిద్ధరామయ్య ప్రభుత్వం భూగర్భ జలాల వాడకంపై చార్జీలు విధించాలని నిర్ణయించింది. వాడే బొట్టుబొట్టుకూ పైసలు కట్టాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. అలాగే బోర్‌వెల్స్ ఉన్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లు, వ్యక్తిగత గృహాలు తప్పనిసరిగా డిజిటల్ వాటర్ ఫ్లో మీటర్లను, అపార్ట్మెంట్లకు టెలీమెట్రీ సిస్టమ్‌లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది.
భూగర్భం నుంచి తీసే ప్రతి క్యూబిక్ మీటర్ జలానికి రూపాయి నుంచి 35 రూపాయల వరకు చార్జీలు విధించనుంది. ఇది వ్యక్తులకు, హౌసింగ్ సొసైటీలకు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు, మైనింగ్ నిర్వాహకులకు వర్తిస్తుందని తెలిపింది. అన్ని రకాల అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లు, గ్రూప్ హౌసింగ్ సొసైటీలు, నీటిని సరఫరా చేసే ప్రభుత్వ సంస్థలుఇక నుంచి ఈ చార్జీలను చెల్లించాల్సిందే.