చెన్నై: అధికారంలో భాగం కోసం కాంగ్రెస్ నిస్సిగ్గుగా కప్పదాటు చర్యకు పాల్పడింది. ఇన్నాళ్లు తాము ఉంటున్న డీఎంకే కూటమిని విడిచిపెట్టి విజయ్‌కు చెందిన టీవీకేతో చేతులు కలుపుతున్నట్టు బుధవారం ప్రకటించింది. రెండు పార్టీల మధ్య పరస్పర గౌరవం, సముచిత వాటా, భాగస్వామ బాధ్యత ఆధారంగా ఈ పొత్తు ఉంటుందని తెలిపింది. కాగా, రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఐదు సీట్లను గెల్చుకుంది. ప్రస్తుతం అధికారాన్ని చేపట్టేందుకు మ్యాజిక్ ఫిగర్‌కు 10 సీట్ల దూరంలో టీవీకే ఆగిపోయిన క్రమంలో కాంగ్రెస్ ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలంటూ టీవీకే నేత విజయ్ తమను అధికారికంగా కోరారని తమిళనాడు కాంగ్రెస్ ఇన్చార్జి గిరీశ్ చోదంకర్ ఎక్స్‌లో తెలిపారు. దీంతో తమిళనాడు కాంగ్రెస్ కమిటీ, కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ కలిసి టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని మంగళవారం జరిపిన అత్యవసర సమావేశంలో నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. బీజేపీ, దాని మిత్ర పక్షాలు నడిపే ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండరాదన్న నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నామని, అందుకే లౌకిక ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
కాంగ్రెస్ అవకాశవాద పార్టీ
జాతీయ స్థాయిలో చిరకాలంగా తమతో పొత్తులో ఉన్న కాంగ్రెస్ తమను విడిచి టీవీకేతో చేతులు కలపడాన్ని వెన్నుపోటుగా డీఎంకే అభివర్ణించింది. డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై బుధవారం మీడియాతో మాట్లాడుతూ టీవీకేకు మద్దతు ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రకటించడం వెన్నుపోటేనని పేర్కొన్నారు. వారు తమిళనాడు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు వెన్నుపోటు పొడిచారన్నారు. తాము అన్ని వేళలా కాంగ్రెస్‌కు మద్దతు తెలిపామని, ఆ పార్టీకి అండదండగా ఉన్నామని తమ అగ్ర నేత స్టాలిన్.. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా పేర్కొన్నారని అన్నారు. కాంగ్రెస్ ఒక అవకాశవాద పార్టీ అని విమర్శించారు. ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు తెలిపి రాష్ట్రంలో కాంగ్రెస్ ఏం సాధించదల్చుకుందని ఆయన ప్రశ్నించారు.
కేవలం రెండు మంత్రి పదవులకు కక్కుర్తిపడి టీవీకేతో చేతులు కలిపిందని విమర్శించారు. ఒక వేళ తాము కూడా టీవీకేకు మద్దతు ఇస్తామని ఏఐఏడీఎంకే ప్రకటిస్తే అప్పుడు విజయ్ ఎవరి మద్దతు తీసుకుంటారు? అప్పుడు కాంగ్రెస్ ఏమవుతుందని ప్రశ్నించారు. ఈ నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారో తనకు తెలియదు కానీ, అవి కచ్చితంగా జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్నవి కావని అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రజలకు కృతజ్ఞతలు చెప్పడంలో విజయ్ విఫలమయ్యారని, ఆయన తొలుత ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారని విమర్శించారు. దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకోవడానికి బీజేపీ వివిధ రాష్ర్టాల్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తున్నదో కచ్చితంగా అలాంటి పనినే కాంగ్రెస్ తమిళనాడులో చేస్తున్నదని డీఎంకే కోశాధికారి టీఆర్ బాలు విమర్శించారు. తన భాగస్వామిని ఎంచుకునే హక్కు కాంగ్రెస్‌కు ఉండవచ్చునని, అయితే తమకు ఓటు వేసిన ప్రజల అభీష్టాన్ని గౌరవించాల్సిన నైతిక బాధ్యత కూడా ఆ పార్టీపై ఉందన్నారు.
భాగస్వాములను మోసగించడం కాంగ్రెస్‌కు అలవాటే
చిరకాలంగా ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న డీఎంకేను కాంగ్రెస్ విడిచిపెట్టడాన్ని బీజేపీ తీవ్రంగా విమర్శించింది. తన కూటమి పార్టీలను మోసగించడం కాంగ్రెస్‌కు అలవాటేనని వ్యాఖ్యానించింది. ఎటువంటి ఉమ్మడి సిద్ధాంతం కానీ, దృక్పథం కానీ లేని ఈ పొత్తు పేకమేడలా కూలిపోతుందని విమర్శించింది. అయినా కాంగ్రెస్ మోసం చేయని పార్టీ లేదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహ్జాద్ పూనావాలా విమర్శించారు. గతంలో వారు సమాజ్‌వాది పార్టీకి ఏం చేశారో, ఇప్పుడు డీఎంకేకు కూడా అదే చేశారని అన్నారు. ఇండియా కూటమి ఇప్పుడు టీఎంసీ, డీఎంకే, వామపక్షాలు లేని కూటమిగా మారిందన్నారు.