Sam Pitroda | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: కాంగ్రెస్ సీనియర్ నేత, ఓవర్సీస్ విభాగం ఇన్ఛార్జి శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏఐఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీకి ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చైనాపై భారత వైఖరిని విమర్శించారు. ‘చైనాతో వచ్చిన ముప్పేంటో నాకు అర్థం కావడం లేదు. శత్రువుగా చూపించగలిగే అమెరికా స్వభావం వల్లే ఈ భావన పెరిగిందని అనుకుంటున్నా. దేశాలన్నీ ప్రతిఘటించుకోవడం ఆపేసి సహకరించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని నేను నమ్ముతున్నా. మొదటి నుంచి మనం ఘర్షణాత్మక వైఖరి అవలంబిస్తున్నాం. ఇది శత్రువులను తయారుచేస్తున్నది. ఈ ఆలోచనావిధానాన్ని మనం మార్చుకోవాలి. చైనాను శుత్రువుగా చూడటం మానుకోవాలి’ అని శామ్ పిట్రోడా వ్యాఖ్యానించారు.
శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. చైనాతో కాంగ్రెస్ ఒప్పందం ఈ వ్యాఖ్యలతో స్పష్టమవుతున్నదని బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది ఆరోపించారు. భారతదేశ గుర్తింపు, దౌత్యం, సార్వభౌమత్వానికి ఈ వ్యాఖ్యలు బలమైన దెబ్బ అని పేర్కొన్నారు. గల్వాన్ లోయలో మరణించిన మన 20 మంది సైనికులను ఇది అవమానించడం కాదా అని ప్రశ్నించారు. పిట్రోడా వ్యాఖ్యలు భారత సైన్యం, సైనికుల త్యాగాలను అవమానించడమేని పేర్కొన్నారు. కాంగ్రెస్కు భారతదేశ జాతీయ భద్రతకు సంబంధించిన అంశాల కంటే చైనా ప్రయోజనాలే ముఖ్యమని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి ఆరోపించారు. కాగా, పిట్రోడా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలు కావని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ వివరణ ఇచ్చారు.