Mallikarjun Kharge : హర్యానాలో అక్టోబర్ 5న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ తేదీ దగ్గర పడటంతో అక్కడ ఎన్నికల వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఆ రాష్ట్ర ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హర్యానా ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
అందుకు సంబంధించిన వీడియోను ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ‘నిరుద్యోగం, ద్రవ్యోల్బణం రాకెట్ వేగంతో పెరుగుతున్నాయి. హత్యల్లో, కిడ్నాపింగ్లలో హర్యానా సర్కారు నెంబర్ వన్‌గా ఉంది. రైతులకు కనీస మద్దతు ధర లభించలేదు. దానికి బదులుగా వారి కోసం నల్లచట్టాలు వచ్చాయి. హర్యానా ప్రభుత్వం గత పదేళ్లుగా నిద్రపోతోంది. ప్రజలారా మీరు మేల్కొండి..! కాంగ్రెస్ లావో.. హర్యానా బచావో’ అని ఖర్గే వీడియోలో పేర్కొన్నారు.
తాజాగా కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో ఉచిత వైద్యం 25 లక్షల వరకు పెంచుతూ హామీ ఇచ్చింది. బీజేపీ 10 లక్షల వరకే ఉచిత వైద్యాన్ని అందించనున్నట్లు మేనిఫెస్టోలో తెలిపింది. మహిళలకు నెలకు రూ.2 వేల రూపాయలు అందజేస్తామని కాంగ్రెస్ ప్రకటిస్తే.. బీజేపీ వంద రూపాయలు పెంచి మహిళలకు రూ. 2,100 ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చింది. అదేవిధంగా బీజేపీ యువతకు రెండు లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చింది.