Karnataka Assembly Elections | వచ్చే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు (Karnataka Assembly Elections) జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ 43 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను శనివారం విడుదల చేసింది. బీజేపీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి కాంగ్రెస్ (Congress) లో చేరిన సీనియర్ నాయకుడు, రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాడీ (Laxman Savadi )కి అథానీ స్థానం(Athani assembly seat) నుంచి టికెట్ లభించింది. సవాడీ ఆశించిన విధంగానే కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఆ సీటు కేటాయించింది. అయితే కోలార్ సీటు (Kolar assembly seat ) ఆశిస్తున్న కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యకు (Siddaramaiah) మాత్రం భంగపాటు ఎదురైంది. ఆ స్థానాన్ని అధిష్టానం కొత్తూర్ జి మంజునాథ్ (Kothur G Manjunath)కు కేటాయించింది.
సిద్ధరామయ్యని ఆయన కుమారుడు ప్రాతినిధ్యం వహించిన వరుణ (Varuna) నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపిన విషయం తెలిసిందే. ఈ మేరకు తొలి జాబితాలో ఆయనకు వరుణ సీటు కేటాయిస్తూ ఖరారు చేసింది. అయితే, రెండో నియోజకవర్గం కింద కోలార్ స్థానం నుంచి కూడా పోటీ చేయాలని ఆయన భావించారు. ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. కానీ ‘ఒక అభ్యర్థికి ఒకే స్థానం’ నిబంధనను పాటిస్తున్న కాంగ్రెస్.. మాజీ సీఎం విషయంలోనూ దాన్నే అనుసరించింది. ఈ నేపథ్యంలోనే కోలార్ స్థానాన్ని కొత్తూరి మంజునాథ్‌కు కేటాయించింది.
124 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ.. 42మంది అభ్యర్థులతో రెండో జాబితా, తాజాగా 43 అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది. ఇప్పటివరకు మొత్తం 209 మంది అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలబెట్టింది. ఇంకా 15 మంది అభ్యర్థుల సీట్లను ఆ పార్టీ ప్రకటించాల్సి ఉంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇటీవల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ ఎన్నికల తేదీలను ప్రకటించారు. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం మే 24న ముగియనుంది. షెడ్యూల్ ప్రకారం మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 10న ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 13న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. 224 అసెంబ్లీ సీట్లున్న కర్ణాటకలో ప్రస్తుతం బీజేపీకి 119, కాంగ్రెస్‌కు 75, జేడీఎస్‌కు 28 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నది. రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి.
Also Read..
Lengthening surgery | అమ్మాయిలు డేటింగ్‌కు రావట్లేదని.. రూ.కోటికి పైనే ఖర్చు చేశాడు
Vignesh Shivan | నయన్‌తో ప్రేమ అలా మొదలైంది : విఘ్నేశ్ శివన్