బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్‌పై మాజీ ప్రధాన మంత్రి, జేడీఎస్ వ్యవస్థాపకుడు హెచ్డీ దేవెగౌడ విరుచుకుపడ్డారు. ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఇటీవల జరిగిన ఐదు రాష్ర్టాల శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖర్చు చేసినది కర్ణాటక ప్రజా ధనమేనని ఆరోపించారు.
ఎన్నికల్లో పోరాడటానికి కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకనుంచి, ముఖ్యంగా బెంగళూరు నుంచి జరిగిన ధన ప్రవాహాన్ని సిద్ధరామయ్య నిరోధించలేకపోయారని దుయ్యబట్టారు. బెంగళూరులో జరుగుతున్న అక్రమాలను ఎందుకు ఆపలేకపోతున్నారని ప్రశ్నించారు. ఇదంతా కర్ణాటక ప్రజల సొమ్ము అని చెప్పారు. అవినీతిని అరికట్టే సత్తా సిద్ధరామయ్యకు ఉందని తాను అనుకోవడం లేదన్నారు.