Karnataka | కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌పై ఆ రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌కు బీజేపీ నేత దేవరాజేగౌడ ఫిర్యాదు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం డబ్బులు పంచారన్న ఆరోపణల నేపథ్యంలో వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు అనుమతించాలని కోరారు. హాసన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం డబ్బులు పంచాలని నిర్ణయించామని మాజీ ఎమ్మెల్యే శివలింగగౌడ మాట్లాడిన ఒక ఆడియో క్లిప్‌ను ఈ సందర్భంగా గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు.
హాసన్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి శ్రేయాస్ ఎం.పటేల్ విజయం కోసం ఒక్కో ఓటర్‌కు రూ.500 చొప్పున పంచాలని సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్, రాజ్యసభ సభ్యుడు ఎన్.చంద్రశేఖర్ సమక్షంలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని శివలింగగౌడ చెప్పడం ఆ వీడియో క్లిప్‌లో స్పష్టంగా ఉందని దేవరాజేగౌడ తన ఫిర్యాదులో తెలిపారు. ఆ నిర్ణయం ప్రకారం శ్రేయాస్ పటేల్ 5 కోట్లు, గోపాల స్వామి ఒక కోటి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బి.శివరామే ఒక కోటి అందించారని.. మొత్తంగా ఏడు కోట్ల రూపాయలను బేలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పంచేందుకే సిద్ధం చేశామని శివలింగ గౌడ చెప్పడం ఆ ఆడియోక్లిప్‌లో ఉందన్నారు. 70 శాతం ఓటర్లకు, కుదరకపోతే 68 శాతం ఓటర్లకు అయినా అదే రోజు రాత్రి డబ్బులు చేరేలా చూడాలని బేలూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిని ఆదేశించినట్లు ఉందని తెలిపారు.
బేలూరులో నిర్వహించిన ప్రచార కార్యక్రమం కోసం రూ.1.5కోట్లు ఖర్చుచేశానని శివలింగ గౌడ చెప్పడం ఆడియోక్లిప్‌లో ఉందని దేవరాజేగౌడ తెలిపారు. ఆ ఆడియో క్లిప్‌లో ఉన్న వాయిస్ స్పష్టంగా శివలింగేగౌడదేనని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని దీని ద్వారా స్పష్టమవుతుందని తెలిపారు. ప్రతినిధుల చట్టం 1951లోని సెక్షన్లు 123, 77తో పాటు అవినీతి నిరోధక చట్టం కింద కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదు చేయడానికి గవర్నర్ అనుమతి ఇవ్వాలని దేవరాజేగౌడ కోరారు.