న్యూఢిల్లీ, జనవరి 19: కేంద్ర ప్రభుత్వం 2026-2027 కేంద్ర వార్షిక బడ్జెట్లో వివాహిత జంటలకు ఉపశమనం కలిగించే ప్రణాళికను రూపొందిస్తున్నట్టు సమాచారం. ఒకే ఆదాయ వనరుపై ఆధారపడిన కుటుంబాలకు ఉపశమనం కలిగించే లక్ష్యంతో ప్రతిపాదిత సంస్కరణలు వివాహిత జంటలు ఒకే ఉమ్మడి పన్ను రిటర్న్‌ను సమర్పించడానికి వీలు కల్పిస్తాయి. ప్రస్తుతం ఒకే ఆదాయంపై ఆధారపడిన కుటుంబాలు పన్ను మినహాయింపును, సంపాదన లేని జీవిత భాగస్వామికి చెందిన శ్లాబ్ ప్రయోజనాలను వినియోగించుకునేందుకు అనుమతి లేకపోవడంతో అధిక పన్ను చెల్లించాల్సి వస్తున్నది. కేంద్రం ప్రతిపాదిస్తున్న కొత్త విధానంలో వివాహిత జంటలు తమ ఆదాయాలను కలిపి ఒకే ఆదాయ పన్ను రిటర్న్‌గా దాఖలు చేయడానికి అనుమతి ఉంటుంది. అయితే ఉమ్మడి పన్ను రిటర్న్ దాఖలు తప్పనిసరి కాదు. ప్రస్తుతం ఉన్న వ్యక్తిగత దాఖలు విధానం, కొత్త ఉమ్మడి దాఖలు విధానం మధ్య ఏదో దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. అయితే ఉమ్మడి దాఖలు విధానాన్ని ఎంపిక చేసుకునే దంపతులు ఉభయులకూ పర్మనెంట్ అకౌంట్ నంబర్లు(పాన్) తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉంటుంది.