న్యూఢిల్లీ: మద్దతు ధరలపై కమిటీ ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. ఐదు రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ‘కమిటీ ఏర్పాటుపై ఎన్నికల సంఘానికి కేంద్రప్రభుత్వం లేఖ రాసింది. ఐదు రాష్ర్టాల్లో ఎన్నికల తర్వాత కమిటీపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఈసీ సూచించింది’ అని తోమర్ ఓ ప్రశ్నకు సమాధానంగా రాజ్యసభలో వెల్లడించారు. మరోవైపు స్వామినాథన్ కమిటీ చేసిన సిఫారసుల్లో కేంద్రప్రభుత్వం ఎన్నింటిని ఆమోదించింది? ఎన్నింటిని అమలు చేస్తున్నది? అని బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్రా పార్లమెంటులో ప్రశ్నించారు. దీనికి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాస్ చౌదరి సమాధానం ఇచ్చారు. ‘స్వామినాథన్ కమిటీని 2004లో ఏర్పాటు చేశారు. 2006 కమిటీ నివేదిక సమర్పించింది. 215 సిఫారసులు చేసింది. 2007లో ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ 201 సిఫారసులను ఆమోదించింది. ప్రస్తుత ప్రభుత్వం 200 సిఫారసులను అమలు చేస్తున్నది. ఉత్పత్తి వ్యయానికి 1.5 రెట్లు అధికంగా మద్దతు ధర ఇవ్వాలన్న సిఫారసును అప్పటి మంత్రుల కమిటీ తిరస్కరించింది’ అని చెప్పారు.