న్యూఢిల్లీ: జమిలీ ఎన్నికల(One Nation, One Election) నిర్వహణపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఇవాళ ఆ రిపోర్టును రాష్ట్రపతి ముర్ముకు అందజేశారు. ఆ రిపోర్టులో ఏముందో ఓసారి పరిశీలిద్దాం. మొదటగా లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత వంద రోజుల వ్యవధిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని రామ్‌నాథ్ కోవింద్ ప్యానెల్ తెలిపింది. ఒకవేళ హంగ్ ఏర్పడితే అప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత మరో అయిదేళ్లకు చెందిన తాజా ఎన్నికలను మళ్లీ నిర్వహించాల్సి ఉంటుందని కోవింద్ ప్యానెల్ రిపోర్టులో పేర్కొన్నది.
తొలిసారి జరిగే జమిలీ ఎన్నికలకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల కాల పరిమితి లోక్‌సభ ఎన్నికల తేదీ నాటికే ముగుస్తుందని రిపోర్టులో తెలిపారు. జమిలీ ఎన్నికలు నిర్వహించాలని కమిటీ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు రిపోర్టులో తెలిపారు. 2029 నుంచే జమిలీ ఎన్నికలు నిర్వహించాలని రిపోర్టులో కోరారు. 18626 పేజీలతో రిపోర్టును తయారు చేశారు.
జమిలీ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తు ప్లానింగ్ ఉండాలని, ఎన్నికలకు అవసరమైన ఎక్విప్మెంట్స్, సిబ్బంది, భద్రతా బలగాలను మోహరించాల్సి ఉంటుందని రిపోర్టులో పేర్కొన్నారు. సింగిల్ ఎన్నికల రోల్‌ను ఈసీ తయారు చేయాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాల అధికారులతో కలిసి లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలకు చెందిన ఓటరు ఐడీ కార్డులను రూపొందించాల్సి ఉంటుంది.
జమిలీ ఎన్నికల నిర్వహణ ద్వారా పారదర్శకత పెరుగుతుందని కోవింద్ ప్యానెల్ రిపోర్టులో చెప్పింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా భారతీయుల ఆశలు నిజం అవుతాయని పేర్కొన్నారు. జమిలీతో పరిపాలనా వ్యవస్థ వృద్ధి చెందుతుందని రిపోర్టులో తెలిపారు.