కొచ్చి : మహిళ శరీర ఆకృతిపై చేసే వ్యాఖ్య లైంగిక పరమైనదేనని, ఇది శిక్షించదగిన లైంగిక వేధింపుల నేరం అవుతుందని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. అందమైన శరీర ఆకృతిపై యథాలాపంగా చేసే వ్యాఖ్యలను లైంగిక వేధింపులుగా పరిగణించరాదని కేరళ రాష్ట్ర విద్యుత్తు బోర్డు మాజీ ఉద్యోగి దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ నెల 6న తోసిపుచ్చింది. ఇదే సంస్థలో పని చేస్తున్న ఓ మహిళ ఆయనపై ఫిర్యాదు చేశారు. అభ్యంతకరమైన సందేశాలు పంపేవాడని, వీడియో కాల్స్ చేసేవాడని ఆమె ఆరోపించారు. కేఎస్ఈబీ, పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఆయన ఈ దుష్ప్రవర్తనను కొనసాగించాడని తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా బాధితురాలిపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును రద్దు చేయాలని ఆయన కోరారు. అయితే, ప్రాసిక్యూషన్, బాధితురాలు వాదనలు వినిపించింది. తనను అతను వేధించాడని తెలిపింది. వీరి వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. పిటిషనర్‌కు గతంలో ఇచ్చిన తాత్కాలిక ఉపశమనాన్ని ఉపసంహరించింది.