బెంగళూరు: పోలీస్ శాఖలో హోంగార్డ్‌గా పని చేస్తున్న భార్యను ఒక వ్యక్తి హత్య చేశాడు. అత్త, పిల్లల ఎదుట కత్తితో పలుమార్లు పొడిచి ఆమెను చంపాడు. (Man Stabs Home Guard Wife) ఆ తర్వాత అదే కత్తితో గాయపర్చుకునేందుకు ప్రయత్నించాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. 32 ఏళ్ల మంజుల, మహదేవపుర పోలీస్ స్టేషన్లో హోమ్ గార్డుగా విధులు నిర్వహిస్తున్నది. 15 ఏళ్ల కిందట ప్రదీప్‌తో ఆమెకు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.
కాగా, ప్రదీప్‌కు ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు ఉన్నది. దీనివల్ల భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరిగేవి. అలాగే మంజుల ప్రవర్తనను ప్రదీప్ అనుమానించేవాడు. పిల్లల తండ్రి ఎవరంటూ సందేహం వ్యక్తం చేసేవాడు. భర్త వేధింపులు భరించలేని మంజుల నెలన్నర రోజులుగా తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఇంట్లో నివసిస్తున్నది.
మరోవైపు ఆదివారం ప్రదీప్ ఆ ఇంటికి చేరుకున్నాడు. తనను క్షమించి ఇంటికి తిరిగి రావాలని భార్య మంజులను బతిమాలాడు. ఆమె కాళ్లపై పడి తన ప్రవర్తనకు క్షమాపణలు చెప్పాడు. ఆ తర్వాత ఒక్కసారిగా హింసాత్మకంగా మారిపోయాడు. అత్త, ఇద్దరు పిల్లల కళ్ల ముందే మంజులను 20 సార్లకు పైగా కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత అదే కత్తితో తన చేతిని కోసుకుని హాని కలిగించుకునేందుకు అతడు ప్రయత్నించాడు.
అయితే భార్య మంజుల హత్యకు ముందు ప్రదీప్ ఒక వీడియో మెసేజ్‌ను రికార్డ్ చేశాడు. తన బెట్టింగ్ వ్యసనం తన కుటుంబాన్ని నాశనం చేసిందని అతడు అంగీకరించాడు. ‘నా భార్య లేకుండా నేను ఉండలేను. ఆమె తండ్రి, బావమరిదితో నేను మాట్లాడాను. సాయంత్రం పని ముగించుకుని ఆమె తిరిగి వస్తుంది. నాతో వచ్చేయమని మళ్లీ అడుగుతా. ఒకవేళ రానని చెబితే, అక్కడే ఆమెను చంపేస్తా’ అని ఆ వీడియోలో పేర్కొన్నాడు. పోలీసులు దీనిని పరిశీలించారు. నిందితుడు ప్రదీప్‌ను అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.