న్యూఢిల్లీ, డిసెంబర్ 12: దేశంలో నివసిస్తున్న అక్రమ వలసదారుల వివరాలను సేకరించడం సాధ్యం కాదని కేంద్రం వెల్లడించింది. అనేక అక్రమ మార్గాలు, రహస్య ప్రదేశాల ద్వారా నిత్యం వలసదారులు దేశంలోని వివిధ ప్రాంతాల్లోకి చొరబడుతూ ఉంటారని, వారిని గుర్తించి, వివరాలు సేకరించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నది.
అక్రమ వలసదారులకు దేశ పౌరసత్వాన్ని కల్పించేందుకు కేవలం అస్సాంకే పరిమితమైన పౌరసత్వ చట్టం 6ఏ రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం తీర్పును రిజర్వ్ చేసింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వలసదారుల్లో 1966 జనవరి 1 నుంచి 1971 మార్చి 25 వరకు ఎంతమందికి భారత పౌరసత్వం ఇచ్చారంటూ ఈ నెల 7న సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది.
దేశంలో ఎంతమంది వలసదారులున్నారు, వారిని అడ్డుకోవడానికి కేంద్రం ఏం చర్యలు తీసుకుంటున్నదని అడిగింది. 17,681 మంది వలసదారులకు భారత పౌరసత్వాన్ని కల్పించినట్టు కేంద్రం తెలిపింది. వేలాది మంది వలసదారులు దేశంలోకి చొరబడుతుంటారని, వారిని గుర్తించడం, నిలువరించడం సంక్లిష్టమైన ప్రక్రియ అని పేర్కొంది. అయినప్పటికీ 2017-2022 మధ్య దేశంలో అక్రమంగా తిష్టవేసిన 14,346 మంది విదేశీయులను గుర్తించి వెనక్కి పంపినట్టు తెలిపింది. అస్సాంలో ప్రస్తుతం వంద ఫారిన్ ట్రిబ్యునల్స్ పనిచేస్తున్నాయని, దీని ద్వారా ఈ ఏడాది అక్టోబర్ 31 నాటికి 3.34 లక్షల కేసులను పరిష్కరించినట్టు పేర్కొన్నది.