శనివారం 27 ఫిబ్రవరి 2021
National - Jan 24, 2021 , 10:02:04

దేశంలో కోల్డ్‌వేవ్‌ పరిస్థితులు

దేశంలో కోల్డ్‌వేవ్‌ పరిస్థితులు

న్యూఢిల్లీ : దట్టమైన పొగమంచు కారణంగా దేశంలో కోల్డ్‌వేవ్‌ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఢిల్లీలో మంగళవారం (ఈ నెల 26న) చలిగాలులు వీచే అవకాశం ఉందని, కనిష్ఠ ఉష్ణోగ్రతలు నాలుగు డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం ఢిల్లీని పొగమంచు కప్పేసింది. శనివారం కనిష్ఠ ఉష్ణోగ్రత ఎనిమిది డిగ్రీలు, గరిష్ఠ ఉష్ణోగ్రత 20.4 డిగ్రీలుగా నమోదయ్యాయి. సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా నమోదైందని ఐఎండీ చెప్పింది. అలాగే ఢిల్లీలో గాలి నాణ్యత తగ్గింది. గాలి నాణ్యత సూచి పేలవమైన కేటగిరిలో ఉందని సిస్టమ్‌ ఆఫ్‌ ఎయిర్‌ క్వాలిటీ వెదర్‌ ఫోర్కాస్టింగ్‌ రీసెర్చ్‌ (సఫర్‌) తెలిపింది. ఈ నెల 26-27 మధ్య ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ తీవ్రమైన చలిగాలులు వీచనున్నాయి. ఉత్తర రాజస్థాన్‌లో జనవరి 24-27 మధ్యకాలంలో ప్రభావం ఉంటుందని ఐఎండీ పేర్కొంది.


ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, చండీగఢ్‌, పంజాబ్‌, అసోం, మేఘాలయ, నాగాలాండ్‌, మణిపూర్‌, మిజోరాం, త్రిపుర, బిహార్‌, ఉత్తర రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఉంటుందని చెప్పింది. ఇదిలా ఉండగా.. కాశ్మీర్‌లో శనివారం భారీగా మంచు వర్షం కురుస్తోంది. దీంతో పూంచ్, రాజౌరీ, రంబన్, దోడా, కిష్త్వర్, అనంతనాగ్, కుల్గాం, బారాముల్లా, కుప్వారా, బందిపోరా, గందర్బల్, కార్గిల్ జిల్లాల మధ్య ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. జమ్మూకాశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లోని హిమపాతం కురిసింది. జమ్మూ కాశ్మీర్, లడక్, గిల్గిత్-బాల్టిస్థాన్, ముజఫరాబాద్, హిమాచల్‌ప్రదేశ్‌లలో విస్తారంగా వర్షాలు, హిమపాతం కురిసే అవకాశం ఉందని ఐఎండీపేర్కొంది. ఆదివారం లక్షద్వీప్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అలాగే దేశంలోని పలు ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని పేర్కొంది.


VIDEOS

logo