భోపాల్, జూన్ 12: కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రంలో జరిగిన అవకతవకల వెనుక ఆ సీటును ఆశిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులే ఉన్నారని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే వారు ఆమె నామిషన్ పత్రంలో పొరపాట్లు జరిగేలా చూశారని ఆయన అన్నారు. రాజ్యసభ సీటును ఆశిస్తున్న చాలా మంది కాంగ్రెస్ నాయకులు తమను ఆ సీటుకు నామినేట్ చేయకపోవడంతో పార్టీ అధిష్ఠానం నామినేట్ చేసిన మీనాక్షి ఎన్నిక కాకుండా కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. తన సొంత ఎమ్మెల్యేలపైనే కాంగ్రెస్కు నమ్మకం లేదని, క్రాస్ ఓటింగ్ భయంతో ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించేందుకు ప్రయత్నించిందని ఆయన చెప్పారు. కాంగ్రెస్లో అంతర్గత పోరే మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ ఖండేల్వాల్ ఆరోపించారు.