చెన్నై, సెప్టెంబర్ 7: ప్రతిపక్ష డీఎంకేను ఉద్దేశించి తమిళనాడు సీఎం విజయ్ తీవ్ర హెచ్చరిక జారీచేశారు. వ్యక్తిగత దాడులు, ద్వంద్వార్థ మాటలు, మహిళలను లక్ష్యంగా చేసుకొని దూషించటం..వంటి వాటిపై తక్షణమే, రాజీలేని చట్టపరమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సీఎం విజయ్ సోమవారం అసెంబ్లీలో మాట్లాడారు. ‘రాజకీయం అనే ముసుగులో మహిళలను, మన ప్రజలను వ్యక్తిగతంగా అవమానిస్తూ, దిగజారుడు భాషలో మాట్లాడేవారికి నా విన్నపం. దయచేసి అలా చేయకండి’ అని అన్నారు. దివంగత సీఎం జయలలితకు ఆనాడు సభలో ఎదురైన అవమానాన్ని విజయ్ ప్రస్తావించారు.
ఇలాంటివి పునరావృతం కాకూడదని నొక్కి చెబుతూ, శాసనసభలో విషపూరితమైన ప్రవర్తనను సమర్థించలేనని అన్నారు. ఒక అగ్రశ్రేణి నటికి సంబంధించి ఇటీవల తలెత్తిన రాజకీయ దుమారాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ప్రజా జీవితంలో మహిళలపై జరుగుతున్న వ్యక్తిగత, అసభ్యకరమైన దాడులను సీఎం విజయ్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో కఠినమైన రాజకీయ విమర్శలు స్వాగతించదగినవే, మహిళలపై వ్యక్తిగత దాడులను మాత్రం సహించ బోనని ఆయన అన్నారు.