కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం తీసుకొంటున్న ప్రతీ నిర్ణయమూ దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నది. మొన్న రూపాయి సింబల్ ప్లేస్‌లో తమిళ అక్షరాన్ని చేర్చిన డీఎంకే ప్రభుత్వం.. నిన్నటికి నిన్న సుప్రీంకోర్టులో కొట్లాడి మరీ గవర్నర్ ఆమోదం అవసరం లేకుండానే పది పెండింగ్ బిల్లులకు చట్టబద్ధతను కల్పించింది. తాజాగా మరో అడుగు ముందుకు వేసి రాష్ట్ర స్వయంప్రతిపత్తికి అవసరమైన కార్యాచరణపై కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రవేశపెట్టిన ఓ తీర్మానాన్ని తమిళనాడు శాసనసభ మంగళవారం ఆమోదించింది.
చెన్నై, ఏప్రిల్ 15/(స్పెషల్ టాస్క్ బ్యూరో): రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకోకుండా నిరవధికంగా పెండింగ్‌లో ఉంచిన తమిళనాడు గవర్నర్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కొన్ని రోజుల్లోనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకొన్నారు. రాష్ట్ర స్వయంప్రతిపత్తి సాధనకు అవసరమైన అధ్యయనాన్ని పూర్తి చేసేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు మంగళవారం అసెంబ్లీ స్టాలిన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించింది.
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ర్టాలకు గల హక్కులు, స్వయంప్రతిపత్తిని అధ్యయనం చేసేందుకు ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు స్టాలిన్ ప్రకటించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ ఈ కమిటీకి సారథ్యం వహిస్తారని చెప్పారు. ఈ నిర్ణయానికి సంబంధించి తమిళనాడు అసెంబ్లీలో స్టాలిన్ ఓ తీర్మానాన్ని ఆమోదించారు. రాష్ర్టాల హక్కులను కేంద్రం హస్తగతం చేసుకుంటోందని ఆయన మండిపడ్డారు. కేంద్రం పెత్తనాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమన్నారు.
తమిళనాడు సహా అన్ని రాష్ర్టాల హక్కులను పరిరక్షించడమే తన ధ్యేయమని ఈ సందర్భంగా స్టాలిన్ ప్రకటించారు. జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయనందుకు తమకు రావలసిన రూ.2,500 కోట్ల నిధులను కేంద్రం నిలిపివేసిందని స్టాలిన్ ఆరోపించారు. తమిళనాడు, కేంద్రానికి మధ్య ఇప్పటికే నెలకొన్న ఘర్షణ వాతావరణాన్ని తాజా నిర్ణయం మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తమిళనాడుపై కేంద్రం పెత్తనం చెలాయించడానికి ప్రయత్నిస్తున్నదంటూ గత కొన్నిరోజులుగా స్టాలిన్ ఆరోపిస్తున్నారు. నీట్ పరీక్ష, నూతన జాతీయ విద్యా విధానం, జీఎస్టీ పేరిట కేంద్రం తీసుకొంటున్న ఏకపక్ష నిర్ణయాలను ప్రతీసారీ ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ర్టానికి స్వయంప్రతిపత్తిని కల్పించడం ద్వారా కేంద్రం చర్యలకు ముకుతాడు వేయాలని ఆయన భావిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కమిటీ ఏర్పాటు ప్రకటన చేసిన అనంతరం స్టాలిన్ మాట్లాడుతూ.. రాష్ట్ర అభీష్టానికి విరుద్ధంగా కేంద్రం బలవంతంగా తమపై నీట్ పరీక్ష, నూతన జాతీయ విద్యా విధానం, జీఎస్టీ వంటివాటిని రుద్దుతోందని పేర్కొనడం గమనార్హం. రాష్ట్ర హక్కులను పరిరక్షించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు జస్టిస్ కురియన్ జోసెఫ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు స్టాలిన్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కమిటీ అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సులు అందచేస్తుందని చెప్పారు.
స్వయం ప్రతిపత్తిపై కమిటీ ఏర్పాటు ప్రకటనపై కూడా స్టాలిన్ ఎంతో ఆచితూచి వ్యవహరించారు. రూల్ 110 కింద ఈ ప్రకటన చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. శాసనసభలో ముఖ్యమంత్రి లేదా మంత్రులు రూల్ 100 కింద ఏదైనా ప్రకటన చేస్తున్నప్పుడు దానిపై తమ అభిప్రాయాన్ని తెలియజేయడానికి లేదా ఆ ప్రకటనను ఖండించడానికి ప్రతిపక్ష నేతలకు ఈ నిబంధన ఎలాంటి అవకాశం ఇవ్వదు.
యూనియన్ ఆఫ్ ఇండియాలో భాగమైన రాష్ట్రప్రభుత్వానికి 7వ షెడ్యూల్, ఆర్టికల్ 244ఏ ప్రకారం స్వయంప్రతిపత్తి హోదా లభిస్తే, సదరు రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి కీలక నిర్ణయాలను స్వతహాగా తీసుకోగలుగుతుంది. ఆర్థికం, విద్య, వైద్యం, సంక్షేమం, సంస్కృతి, ఆచారాల వంటి కీలక విషయాల్లో రాష్ట్రప్రభుత్వానిదే అంతిమ నిర్ణయాధికారంగా ఉంటుంది. ఇందులో కేంద్రం జోక్యం ఉండబోదు.