CM Revanth Reddy | న్యూఢిల్లీ, డిసెంబర్ 30: దేశంలో అత్యధిక కేసులు ఉన్న ముఖ్యమంత్రుల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మొదటి స్థానంలో నిలిచారు. 31 మంది ముఖ్యమంత్రుల్లో ఆయనపైనే అత్యధిక సంఖ్యలో కేసులు నమోదైనట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్(ఎన్ఈడబ్ల్యూ) నివేదిక వెల్లడించింది. ఆయనపై మొత్తం 89 కేసులు ఉండగా, వీటిలో 72 కేసులు ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ) కింద నమోదైన తీవ్రమైన కేసులని ఈ నివేదిక పేర్కొన్నది. మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల్లో 13 మంది తమపై క్రిమినల్
కేసులు ఉన్నట్టు ప్రకటించారు.
ఇందులో 10 మందిపై హత్యాయత్నం, కిడ్నాప్, లంచం, నేరపూరిత బెదిరింపులు వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. నేరపూరిత బెదిరింపు(ఐపీసీ సెక్షన్-506), ఐపీసీ సెక్షన్-505(2), రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం(ఐపీసీ సెక్షన్-505), మోసం చేయడం, ఆస్తిని అప్పగించడానికి మోసపూరితంగా ప్రేరేపించడం(ఐపీసీ సెక్షన్-420), ఖాతాల తప్పుడు సమాచారం ఇవ్వడం(ఐపీసీ సెక్షన్-477ఏ), మతవిశ్వాసాన్ని అవమానించడం లేదా మతాన్ని రెచ్చగొట్టడం(సెక్షన్-295ఏ) వంటి ఆరోపణలతో రేవంత్ రెడ్డిపై కేసులు ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొన్నది. కాగా, రేవంత్ రెడ్డి తర్వాత 47 కేసులతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రెండోస్థానంలో ఉన్నారు.