ముంబై: వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల (Lok Sabha polls) నాటికి విపక్షాలు ఏకం చేయడానికి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (CM Nitish Kuma) ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 2024లో మరోసారి కేంద్రంలో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని కృతనిశ్చయంతో ఉన్న ఆయన బీజేపీ యేతర పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నారు. ఇందులో భాగంగా నేడు ముంబైలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో (Sharad Pawar) సమావేశం కానున్నారు. బీహార్ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో (Tejashwi Yadav) కలిసి గురువారం మధ్యాహ్నం ముంబైకి చేరుకోనున్నారు.
మొదట ఉద్ధవ్ ఠాక్రేతో (Uddhav Thackeray) భేటీ అవుతారని, సాయంత్రం శరద్ పవార్‌ను కలుస్తారని జేడీయూ ఎమ్మెల్సీ కపిల్ పాటిల్ (MLC Kapil Patil) చెప్పారు. భవిష్యత్ రాజకీయాలపై చర్చించనున్నారని తెలిపారు. నితీశ్, తేజస్వీ ధ్వయం గత నెల 24న పశ్చిమ బెంగల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అయిన విషయం తెలిసిందే. అంతకుముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ ముఖ్యనేత సోనియా గాంధీ భేటీ అయ్యారు. త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నట్లు తెలుస్తున్నది.