బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజ్యసభకు వెళ్లనున్నారా? మారిన జాతీయ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఈ వార్తకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ప్రధాని పదవి రేసులో నితీశ్ పేరు చాలా సార్లే వినిపించింది. అయితే.. తాజాగా.. సీఎం నితీశ్ విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్య చేశారు. ఏదో ఒక రోజు నేను రాజ్యసభకు వెళ్తానని అనుకుంటున్నాను. రాజ్యసభ సభ్యుడుగా ఉండాలని నేను గతంలో అనుకున్నాను అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఈయన వ్యాఖ్యలు కొత్త ఊహాగానాలకు తెరలేపాయి.
‘తిరిగి నలందా పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా? అని ప్రశ్నించగా… అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు. మరి రాజ్యసభకు వెళ్తారా? అని విలేకరులు వెంటనే అడగ్గా… రాజ్యసభకు వెళ్లడానికి మాత్రం నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు. గతంలో కూడా నేను అనుకున్నాను. కానీ.. ఇప్పుడు నాకు ముఖ్యమంత్రి బాధ్యతలు ఉన్నాయి.’ అంటూ నితీశ్ కుమార్ పేర్కొన్నారు.