MK Stalin | మార్చి 22న చెన్నైలో సమావేశంచెన్నై, మార్చి 7: జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా కేంద్రంపై పోరుకు కలిసిరావాలని ఏడు రాష్ర్టాల సీఎంలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లేఖ రాశారు. డీలిమిటేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీల ఉమ్మడి కార్యాచరణ కమిటీలో భాగస్వాములు కావాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, బీజేపీ పాలిత ఒడిశా సీఎం మోహన్ చంద్ర మాఝి, కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు ఆ రాష్ర్టాలలో అధికారంలో లేని పార్టీల సీనియర్ నాయకులు, బీజేపీ నాయకులకు కూడా స్టాలిన్ పిలుపునిచ్చారు. ఉమ్మడి కార్యాచరణను రూపొందించేందుకు మార్చి 22న చెన్నైలో సమావేశం నిర్వహిస్తున్నట్టు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ప్రకటించారు.
సమాఖ్య వ్యవస్థపై దాడి
నియోజకవర్గాల పునర్విభజన సమాఖ్యవ్యవస్థపై దాడిగా స్టాలిన్ అభివర్ణించారు. పార్లమెంట్లో తమ వాణిని వినిపించే హక్కును తొలగించడం ద్వారా జనాభా నియంత్రణ కోసం పాటుపడిన రాష్ర్టాలను కేంద్రం శిక్షిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ ప్రజాస్వామిక అన్యాయాన్ని తాము అనుమతించబోమని స్టాలిన్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం హిందీ విధింపు, పునర్విభజనలను డీఎంకే తీవ్రంగా నిరసిస్తున్నది. జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ర్టాలను నియోజకవర్గాల పునర్విభజన చర్య నాశనం చేయగలదని స్టాలిన్ హెచ్చరించారు.
వాజ్పేయి ప్రభుత్వం 2002లో తీసుకువచ్చిన సవరణ ద్వారా 1976 తర్వాత జరిగిన డీలిమిటేషన్ ప్రక్రియలను నిలిపివేసిందన్నారు. దీని ద్వారా 2026 వరకు లోక్సభ సీట్లలో ఏ విధమైన మార్పులు రావడానికి వీల్లేదని ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలని కేంద్రం ఆలోచిస్తోందని, దీని వల్ల జనాభాను నియంత్రించిన రాష్ర్టాలు లోక్సభలో స్థానాలను కోల్పోనుండగా జనాభాను నియంత్రించని రాష్ర్టాలు లాభపడనున్నాయని స్టాలిన్ పేర్కొన్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ర్టాలు తీవ్రంగా నష్టపోనుండగా ఉత్తరాది రాష్ర్టాలు లాభపడనున్నాయని ఆయన వివరించారు.
హిందీ వలసపాలనను సహించం
బ్రిటిష్ వలసపాలన స్థానంలో హిందీ వలసపాలనను తమిళనాడు సహించబోదని స్టాలిన్ హెచ్చరించారు. హిందీ అమలును అనుమతించాలంటూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బెదిరిస్తూ రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. తాను ఎన్నడూ గెలవలేని యుద్ధానికి కేంద్ర మంత్రి ప్రధాన్ కాలుదువ్వుతున్నారని స్టాలిన్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. తమిళనాడును ఎవరూ బ్లాక్మెయిల్ చేసి లొంగదీసుకోలేరని ఆయన స్పష్టం చేశారు.