CM KCR | ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేటుపరం చేస్తోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ ప్రభుత్వపరం చేస్తామన్నారు. ఔరంగాబాద్ జబిందా మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ‘ప్రస్తుతం తెలంగాణలో 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నాం. తెలంగాణలో 24 గంటలు సాధ్యనమైనప్పుడు మహారాష్ట్రలో ఎందుకు కాదు. ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా ఇక్కడ అమలు చేయవచ్చు. దేశంలో కొత్త లక్ష్యాలు, సంకల్పంతో ముందుకెళ్లాలి. దేశంలో 24 గంటలు విద్యుత్ సరఫరా చేసే వనరులు ఉన్నాయి. దేశం మొత్తం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వొచ్చు. ఇది అబద్ధమైతే నేను ఒక్క నిమిషం సీఎం పదవిలో ఉండను. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారు. మేం వచ్చాక వాటిని తిరిగి ప్రభుత్వపరం చేస్తాం. దేశంలోని సమస్యలను మనమే పరిష్కరించుకుందాం’ అన్నారు.
‘కేసీఆర్‌కు మహారాష్ట్ర ఏం పని అని మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అంటున్నారు. తెలంగాణ లాంటి మోడల్ మహారాష్ట్రలో తీసుకువస్తే నేనెందుకు వస్తా. మహారాష్ట్రలో దళితబంధు, రైతుబంధు అమలు అమలు చేయాలి. 24 గంటల కరెంట్ ఇవ్వండి. రైతుబంధు, రైతుబీమా కల్పించండి. ఇవన్నీ అమలు చేస్తే మహారాష్ట్రకు రానేరాను. అంబేద్కర్ జన్మించిన నేలపై దళితులను పట్టించుకోరా..? దళితబంధు లాంటి పథకం మహారాష్ట్రలో ఎందుకు అమలు చేయరు. పాలనా సామర్థ్యం గల అధికారులు ఉన్నప్పటికీ.. తెలంగాణ తరహా పథకాలు ఇక్కడ ఎందుకు అమలు కావడం లేదు. నూతనంగా నిర్మించే పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలి. మేకిన్ ఇండియా అంటారు. కానీ నగరంలో వీధి వీధికో చైనా బజార్ ఉంటది.
డిజిటల్ ఇండియా మజాక్, మేకిన్ ఇండియా జోక్ అయ్యాయి. మహారాష్ట్ర మంత్రులు కేబినెట్ మంత్రులుంటారు. కానీ చీఫ్ సెక్రెటరీ ఎందుకు ఉండరు. పెద్ద రాష్ట్రమని చెప్పుకునే మహారాష్ట్రలో చీఫ్ సెక్రెటరీ ఉండరా?’ ధ్వజమెత్తారు. ‘మహారాష్ట్రస్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపించాలి. మహారాష్ట్రలో రాబోయే జడ్పీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలి’ అని పిలుపునిచ్చారు. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదు. మన ఓటే సమన సమస్యకు పరిష్కారం. బీఆర్ఎస్ సర్కారును తీసుకురండి మీ సమస్యలు నేను తీరుస్తా. రైతురాజ్యం తీసుకురావడమే బీఆర్ఎస్ లక్ష్యం. మీ అస్త్రం ఓటుగా మారాలి. మీ లక్ష్యం కిసాన్ సర్కార్ కావాలి’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.